సిరాన్యూస్, ఆదిలాబాద్
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం: మాజీ మంత్రి జోగు రామన్న
* బీజేపీ, కాంగ్రెస్ విధానాలపై ప్రజల అసంతృప్తి
* గెలుపు కోసం కష్టపడ్డ వారందరికీ ధన్యవాదాలు
లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ కు సైలెంట్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగిందని, తమ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పోలింగ్ సరళిని విశ్లేషించారు. ఈసందర్భంగా జోగురామన్నమాట్లాడుతూ ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుండి పార్టీ శ్రేనులంతా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారని, నిద్రాహారాలు మాని గెలుపు కోసం కష్టపడ్డ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జోగురామన్న అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పది లక్షలకు పైగా మంది లబ్ధిదారులు వివిధ పథకాల ఫలాలు పొందారని తెలిపారు. వారిలో ఎక్కువ శాతం మంది కారు గుర్తుకే ఓటు వేశారని, సైలెంట్ వోటింగ్ పెద్ద ఎత్తున జరగడంతో బీఆర్ఎస్ సునాయాసంగా విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డబ్బులు వెదజల్లినా… ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నారు. అధికార యంత్రాంగం సైతం మద్యం, నగదు పంపినీ జరిగినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో విఫలమయినందున ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ల పంపిణీ వంటి పథకాల అమలులో ప్రభుత్వం విఫలమయిందని ఆక్షేపించారు. అటు కేంద్రంలోని బీజేపీ తోనూ ఆదిలాబాద్ లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీలపై ఉన్న వ్యతిరేకత తమకు సానుకూలంగా మారిందని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, రోకండ్ల రమేష్. సాజితొద్దీన్, మెట్టు ప్రలద్, ఇజ్జగిరి నారాయణ, కుమ్ర రాజు,భూమన్న, పర్వీన్ ఫెరోజ్, జోహూర్ భాయ్, నవాతే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.