సిరా న్యూస్, ఆదిలాబాద్
ఘనంగా మాజీ మంత్రి జోగు రామన్న పుట్టినరోజు వేడుకలు
* రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ
* మెగా రక్తదాన శిబిరం
మాజీ మంత్రి, బీఆర్ ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న జన్మదిన వేడుకలను గురువారం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జోగురామన్న పట్టణంలోని శాంతినగర్ నివాసంలో కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేశారు. అనంతరం కేఆర్‌కే కాలనీ వృద్ధాశ్రమం తో పాటు రిమ్స్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మొక్కలను నాటారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ఎస్‌టీయూ భవన్ లో ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకలకు వేలాదిగా అభిమానులు తరలివచ్చి తమ అభిమాన నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భారీ గజమాలలతో సత్కారాలు, భారీ ఎత్తున తయారు చేయించిన కేక్ లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు చేరుకొని సందడి చేశారు. మాజీ మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ముందుగా అభిమానులు తీసుకువచ్చిన భారీ కేక్ ను మాజీ మంత్రి కట్ చేయగా, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. స్వచ్చందంగా రక్తదానం చేసిన అభిమానులకు అభినందనలు తెలియచేశారు. శిబిరం వద్ద మాజీ మంత్రితో ఫోటోలు దిగేందుకు కార్యకర్తలు ఆసక్తి చూపడంతో కోలాహల వాతావరణం కనిపించింది. వచ్చిన ప్రతి కార్యకర్తకు సాదరంగా స్వాగతం పలుకుతూ వారితో కలిసి ఫోటోలు దిగి వారిని ఉత్సాహపరిచారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి పండ్ల రసాలను పంపిణీ చేసి వారికి అభినందనలు తెలియచేశారు. నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులూ మాజీ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేశారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కార్యక్రమ ప్రాంగణం వద్ద కోలాహల వాతావరణం కనిపించింది. అదేవిధంగా వివిధ సంఘాల ప్రతినిధులు, మాజీ మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. జై జోగురామన్న, జై తెలంగాణ నినాదాల నడుమ పార్టీ నేతలతో కేక్ కట్ చేసిన ఆయన తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. తన జన్మదిన వేడుకలకు తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తన తుది శ్వాస వరకు ప్రజా సేవకే పునరంకితం అవుతానని పేర్కొన్నారు. అభిమానంతో తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేశారు. మెగా రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరై రక్తదానం చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.