సిరాన్యూస్,ఆదిలాబాద్
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి జోగురామన్న
* ఢిల్లీ పర్యటనలకు పరిమితమైన సీఎం
ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం మినహాయించి ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ఆరోపించారు. పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే అన్ని హామీలను అమలు చేస్తోందని, కాని తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని మండిపడ్డారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలను గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సైతం అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమయిందని ధ్వజమెత్తారు. పెన్షన్లు సకాలంలో అందక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందకపోవడంతో అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రైతు భరోసా, రుణ మాఫీ విషయాల్లో ఇప్పటికీ విధి విధానాలు రూపొందించకపోవడం, పంట సాగు పూర్తయిన తర్వాత ప్రస్తుతం సర్వేల పేరిట కాలయాపన చేయడం దేనికి నిదర్శనమని మండిపడ్డారు. సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఒక్క జాబ్ నోటిఫికేషన్ సైతం విడుదల చేయలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఫోటో ఉందన్న కారణంతో పాఠ్య పుస్తకాల పంపిణీని నిలిపివేసి, పిల్లల భవిష్యత్తులో చెలగాటం ఆడుతున్నారని, ముఖ్యమంత్రి హోదాను మరిచి కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయంలో రాళ్ళ భూములకు రైతు బంధు ఇచ్చామన్న ఆరోపణలను ఆయన కొట్టిపడేశారు. అదే నిజమైతే క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలకు మాత్రమే సీఎం పరిమితమయ్యారని అన్నారు. తమ ప్రభుత్వ హయంలో మిషన్ భగీరథ కింద శుద్ధజలన్ని నిరంతరం సరఫరా చేశామని, నిరంతర విద్యుత్ సరఫరా చేశామని గుర్తు చేసిన మాజీ మంత్రి… ప్రస్తుతం శుద్ధ జలం లేక, నిరంతర విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఎందుకు అవస్థలకు గురవుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, సాజి తద్దిన్. యూనిస్ అక్బాని. కౌన్సిలర్ దమ్మపాల్, పండ్ల శ్రీనివాస్, నవతె శ్రీనివాస్ పాల్గొన్నారు.