నకిలీ విత్తనాల కట్టడికి జాయింట్ టాస్క్ ఫోర్స్ బృందాలు..

క్షేత్రస్ధాయిలో నిరంతరం పర్యవేక్షణ
పోలీస్ కమిషనర్ బి. అనురాధ
సిరా న్యూస్,సిద్దిపేట;
నకిలీ, కల్తీ విత్తనాల రవాణా, విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, విత్తన కార్పొరేషన్, పోలీసు బలగాలతో జాయింట్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారంతా విధినిర్వహణలో నిమగ్నమై ఉన్నారని కమిషనర్ అనురాధ అన్నారు.
లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసిన, దుకాణాలలో, ఏజెంట్లు,మధ్యవర్తుల ముసుగులో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించిన తీవ్రమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా నకిలీ విత్తనాల విక్రయాలలో గతంలో కేసులు నమోదైన వారిపై నిఘా వుంటుందన్నారు. తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు.
ప్రధానంగా గుర్తింపు పొందిన విత్తన దుకాణాల్లో విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.
ఏ ప్రాంతంలోనైనా కచ్చితమైన కంపెనీ పేరు, బిల్లులు లేకుండా విడిగా విత్తనాలు విక్రయిస్తే వెంటనే స్దానిక పోలీస్ స్టేషన్ కు కాని, మండల వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని, ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నాసిరకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదన్నారు.
టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లా పరిధిలోని విత్తన ఎరువుల దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
నకిలీ విత్తనాల సమస్యలను నియంత్రించేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సమాచారం వ్యవస్థను పటిష్టం చేసినట్లు తెలిపారు. దీనికి తోడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్టు తెలిపారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి దుకాణాదారు నుంచి రశీదు తీసుకోవాలన్నారు. పట్టణాలలో, మండలల్లో టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ వుంటుందని తెలియజేసారు.
రైతు దేశానికి వెన్నెముక అని ఆరుగాలం కష్టించి దేశం కడుపు నింపే రైతులను మోసం చేస్తూ దళారులు కొంతమంది నకిలీ విత్తనాలు సరఫరా చేసి రైతులను అప్పుల అగాధంలోకి నెట్టబడుతున్నారని వారి కుటుంబాలను ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్న నకిలీ విత్తనాల సరఫరా, నాసిరకం ఎరువులు కొనుగోలు మరియు విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ పక్కా సమాచారంతో ఎవరైనా నకిలీ విత్తనాల సరఫరా, విక్రయాలు జరిపితే వారిపై దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.
రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, వ్యాపారస్తుల నుంచి తీసుకున్న బిల్లులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించామని వారి ద్వారా మండలాల వారీగా వ్యవసాయ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేశామని తెలిపారు.
నకిలీ విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను ముందుగా గుర్తించడం అడ్డుకోవడం కట్టడి చేయడం, వారు ఎక్కడి నుండి సరఫరా చేస్తున్నారు ప్రైమరీ కాంటాక్ట్, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో పోలీసు అధికారులు వ్యవసాయ రైతులకు అవగాహన కార్యక్రమలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పట్టణాలలో గ్రామాలలో ఎవరైనా తక్కువ ధరకు పత్తి విత్తనాలు కానీ ఇంకా ఏమైనా విత్తనాలు కానీ ఇస్తామని మాయమాటలు చెప్పి విక్రయించడానికి వచ్చిన వారి వివరాలను వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని లేదా డయల్ 100, సిద్దిపేట కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ వాట్సాప్ నెంబర్ 8712667100. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445. 8712667446. 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు.
==========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *