సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పోలింగ్ పూర్తయింది. అధిక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తున్నాయి. కానీ కొన్ని హంగ్ ను అంచనా వేస్తున్నాయి. అందుకే ఫలితాలు ఎలా వస్తే ఎలా స్పందించాలన్న దానిపై ముందుగానే అన్ని రాజకీయ పార్టీలు ప్లాన్ బీ రెడీ చేసుకుంటాయి. అదీ తేడా కొడితే ఏం చేయాలన్నదానిపై ప్లాన్ సీ కూడా రెడీ చేసుకుంటాయి. బీఆర్ఎస్‌కు ఓ ప్లాన్ ఉంది. బీఆర్ఎస్ వెనుక కావాలనుకుంటే.. బీజేపీ, మజ్లిస్ ఉంటాయి. మరి కాంగ్రెస్ కు ప్లాన్ బీ ఉందా ? సింపుల్ మెజార్టీ వస్తే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థులు సైలెంట్ గా ఉంటారా ?. కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఏర్పడింది. కానీ 61 సీట్లు వస్తే కాంగ్రెస్ గెలిచినట్లే కానీ ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఎక్కువ మరి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థులం మేమే అనే ప్రకటనలు కనీసం అరడజన్ మంది నేతల నుంచి వచ్చాయి. రేవంత్ రెడ్డి సీఎం రేసులో ఫ్రంట్ రన్నర్ గా ఉంటారు. ఆ తర్వాత దళిత కోటాలో మల్లు భట్టి విక్రమార్క్ కూడా ఉన్నారు. ఆయన పాదయాత్ర కూడా చేశారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సోనియా గాంధీ తననే సీఎంను చేస్తారని కాంగ్రెస్ లో తన కంటే సీనియర్లు ఎవరూ లేరన్నారు. మరికొంత మంది నేతలు కూడా ఉన్నారు . ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం తాను చేయాల్సినదంతా చేస్తారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చాన్స్ రాదని ఆయనకు తెలుసు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమకు ప్లాన్ బీ ఉందని ఆయన పరోక్షంగా చెబుతున్నారు. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన గట్టిగా చెబుతున్నారు.