సిరా న్యూస్, ఆదిలాబాద్:
సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఈనెల 22 న నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల బహిరంగ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఆదివారం స్థానిక నాయకులతో కలిసి సభ స్థలి వద్దకు చేరుకొని ఆయన పలు సూచనలు అందించారు. ప్రధాన వేదిక, జనం ప్రవేశించే మార్గాలు తదితర విషయాలను గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రంలోగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. బహిరంగ సభ విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళకు, ఆదివాసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటును కేటాయించిందని ఆయన అన్నారు. సామాన్య, పేద కుటుంబానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన అత్రం సుగుణ లాంటి వ్యక్తులు చట్టసభలకు వెళితే సామాన్యుల పక్షాన గొంతుకగా మారి తన వాణి వినిపించే అవకాశం ఉందని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించి అధిష్టానానికి బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, నాయకులు రషీద్ ఉల్ హక్, జాఫర్ అహ్మద్, కొండ గంగాధర్, ప్రశాంత్ రెడ్డి, కొండూరి రవి, గిమ్మ సంతోష్, డేరా కృష్ణ రెడ్డి, రాజా లింగన్న, అల్లూరి భూమారెడ్డి, దర్శనాల అశోక్, ఖయ్యుమ్, రఫీక్, షాకీర్, అతిక్ ఉర్ రెహమాన్, తదితరులు ఉన్నారు.