సిరా న్యూస్,కరీంనగర్;
కరీంనగర్ ఫిలిగ్రీ కళాఖండాలు మరోసారి ఖండాంతరాలను దాటనున్నాయి. అంబానీ ఇంట్లో జూలైలో జరగబోయే పెండ్లికి వచ్చే గెస్టులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలను రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు. గత మార్చిలో దిగ్గజ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. కాగా జులైలో వివాహం జరగనుంది. ఈ పెళ్లి వేడుకల్లో అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ బహుమతులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు.ఈ మేరకు భౌగోళిక గుర్తింపు పొందిన ఫిలిగ్రీ తయారీదారులకు ఆర్డర్లు ఇవ్వడంతో కరీంనగర్ కళకు అరుదైన గుర్తింపు లభించినట్లైంది.ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు సమీపిస్తున్నాయి. పెండ్లికి వచ్చే గెస్టులకు వెండితో చేసిన జ్యువెల్లరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్ ఇతర బహుమతులు ఇవ్వనున్నారు. ఇప్పటికే 400 ఫిలిగ్రీ కళాఖండాల కోసం అంబానీ ఫ్యామిలీ నుంచి ఆర్డర్ వచ్చినట్టు కరీంనగర్ సిఫ్కా అధ్యక్షుడు అశోక్ తెలిపారు. ఈ కళాఖండాల ద్వారా అంబానీ ఇంట పెండ్లికి వచ్చే ప్రముఖులకు 400 ఏళ్ల నాటి ఫిలిగ్రీ ప్రాచీన కళ పరిచయమవుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్నుల ఇండ్లకు తమ కళాఖండాలు చేరుతాయని ఆనందం వ్యక్తం చేశారు.గతేడాది జరిగిన జీ-20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోక చక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి కళాకారులే తయారు చేసి పంపించారు. అంతేకాకుండా ఇతర కార్యక్రమాలకు నుంచి ఆభరణాల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు, ఇతరత్రా కళాఖండాల కోసం ఆర్డర్లు లభించాయి. తాజాగా అపరకుబేరుడి ఇంట పెళ్లి కోసం అద్భుతమైన బహుమతుల జాబితాలో ఫిలిగ్రీ చేర్చడం అదనంగా ఉందని కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2023 నవంబర్ లో హైదరాబాద్ అరంగేట్రం చేసిన రిలయన్స్ రిటైల్ స్వదేశ్ స్టోర్‌కు సిఫ్కా వస్తువులను సరఫరా చేస్తోంది. అంతేకాకుండా జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న సిఫ్కా సొసైటీ, ముంబైలోని ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రదర్శించిన ఫిలిగ్రీ కళాఖండాలు అంబానీని ఆకట్టుకున్నాయి.సున్నితమైన వెండితో రకరకాల కళాఖండాలను చేయడంలో కరీంనగర్ కళాకారులు సిద్ధహస్తులు. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళతో కరీంనగర్‌లోని దాదాపు 150 కుటుంబాలకు చెందిన 300 మంది జీవనోపాధి పొందుతున్నారు. 400 ఏళ్లుగా వస్తున్న ఈ పురాతన కళను ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రపంచంలోనే అరుదైన కళగా గుర్తింపు పొందిన సిల్వర్ ఫిలిగ్రీ తరువాత కాలంలో కరీంనగర్ నుంచి లండన్ వరకు వ్యాపించింది. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోల భారీ ఫిలిగ్రీ నెమలిని బహూకరించింది. ఉప రాష్ట్రపతిగా ఎన్నికై మొదటిసారిగా హైదరాబాద్ వచ్చిన వెంకయ్యనాయుడికి రెండున్నర కిలోల కాకతీయ కళాతోరణాన్ని కానుకగా అందించింది. పారిశ్రామికవేత్తల సదస్సుకు హజరైన అమెరికా అద్యక్షుడు ట్రంప్ కుమర్తె ఇవాంకాకు ఫిలిగ్రీ నెమలిని బహూకరించారు. కరీంనగర్‌లో తయారైన డ్రెస్సింగ్ సెట్‌ను నిజాం రాజు బ్రిటర్ రాణి ఎలిజిబెత్‌కు బహూకరించినట్లుగా చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. ఇక జీ 20 దేశాల సమావేశం భారత్ లో నిర్వహించినప్పుడు వివిధ దేశాల నుంచి ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధుల కోటుపైనా కరీంనగర్ ఫిలిగ్రీ కళ మెరిసిపోయింది. వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోక చక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి కళాకారులే తయారు చేసి పంపించారు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎంచుకున్న కళాకృతులను తయారు చేసి వారికి పంపిస్తున్నారు. ప్రస్తుతం 400 వస్తువులకు అంబానీ నుంచి ఆర్డర్లు వచ్చాయని నిర్వహకులు చెప్తున్నారు. వారి కోరిక మేరకు ఆర్డర్లు తయారు చేసి అందిస్తున్నామని తెలిపారు.