కేకే కల ఫలించేనా

సిరా న్యూస్,కరీంనగర్;
కే.కే.మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి జై తెలంగాణ అంటూ గళం విప్పిన లీడర్. రెండు దశాబ్దాలుగా ప్రతిపక్ష నేతగానే కొనసాగుతున్న కేకే మహేందర్‌రెడ్డికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయనే ప్రచారం ఆయన అనుచరుల్లో ఉత్సాహం నింపుతోంది. అటు కే.కే. మహేందర్‌రెడ్డికి కొత్త ఉత్తేజం తెస్తోందంటున్నారు. నాడు ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్‌తో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన కే.కే.మహేందర్‌రెడ్డి వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయ ప్రత్యర్థి కేటీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్న కే.కే.మహేందర్‌రెడ్డిని పట్టు వదలని విక్రమార్కుడిగా చెబుతుంటారు.తొలుత వామపక్ష విద్యార్థి సంఘాల్లో పనిచేసిన కేకే మహేందర్‌రెడ్డి.. 2009లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేయగా, కేవలం 171 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వకపోవడం వల్ల కేటీఆర్‌పై స్వతంత్రంగా పోటీ చేసి ఓటమి అంచుల వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కేటీఆర్‌ నిలదొక్కుకోవడంతో కే.కే.మహేందర్‌రెడ్డికి గెలుపు పిలుపు అందలేదు. కానీ, ఆయన ఏనాడూ నిరాశ చెందలేదు. కాంగ్రెస్‌ కార్యకర్తలకు అండగా నిలుస్తూ.. కేటీఆర్‌తో అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు.ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండటంతో కే.కే.మహేందర్‌రెడ్డికి ఏ పదవి ఇస్తారా? అని కాంగ్రెస్‌ క్యాడర్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైంది. ఇప్పటికే చాలా మందికి నామినేటెడ్ పోస్టుల్లో నియమించిన పార్టీ… కే.కే.మహేందర్‌రెడ్డిని వదిలేసిందని విమర్శలు ఎదుర్కొంది. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీతోనే వెయిటింగ్‌లో పెట్టినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో తొలి అవకాశం కే.కే.మహేందర్‌రెడ్డికే ఇస్తారని చెబుతున్నారు.రెండు దశాబ్దాలుగా గెలుపోటములతో సంబంధాలు లేకుండా రాజకీయ పోరు సాగిస్తున్న మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఆయన వర్గీయులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ హామీతో మహేందర్‌రెడ్డి కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. రెండు దశాబ్దాలుగా చట్టసభల్లో అడుగు పెట్టాలనే తన ఆకాంక్ష త్వరలో ఫలించే అవకాశం ఉందన్న సమాచారంతో… మంచి రోజులు ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూస్తున్నారట… మొత్తానికి కాంగ్రెస్‌ అధినాయత్వం హామీతో సిరిసిల్ల కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.మొత్తానికి కే.కే.మహేందర్‌రెడ్డి ఎపిసోడ్‌ కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రాజకీయల్లో ఫాస్ట్ ట్రాక్‌లో పదవులు పొందిన నేతలు ఎందరో ఉన్నారు… బై పాస్‌లో వచ్చి కుర్చీ మీద కూర్చున్న నేతలు చాలా మంది కనిపిస్తుంటారు. కానీ.. ఏ పదవీ లేకుండా మహేందర్‌రెడ్డి వంటి నేతలు అరుదుగా కనిపిస్తుంటారు. ఇప్పటికైనా ఆయన నిరీక్షణ ఫలిస్తుందో? లేదో? అన్నదే ఆసక్తికరంగా మారింది. మహేందర్‌రెడ్డి కల నెరవేరాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *