ఖమ్మం..వరద సాయం ఎక్కడ…ఎంత

సిరా న్యూస్,ఖమ్మం;
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలుగు రాష్ట్రాలను వరదలు, వానలు ముంచెత్తాయి. ఏపీలోని విజయవాడను, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలు వరదలో చిక్కుకున్నాయి. దాంతో ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆస్తులు కోల్పోయారు. పంటలు నష్టపోయారు. ప్రాణాలూ కోల్పోయారు. వర్షాలు, వరదలు తగ్గి పది రోజులు కావస్తున్నా ఇంకా ఆ చేదు జ్ఞాపకాల నుంచి వారు బయటపడడం లేదు. బురదతో నిండిన ఇళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా వాటిని శుభ్రం చేసుకున్నారు.విజయవాడలో జరిగిన నష్టంతో అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావం తగ్గే వరకూ అక్కడే కలెక్టరేట్‌లో ఉండి పర్యవేక్షించారు. బాధితుల కష్టాలను కళ్లారా చూశారు. వారికి మనోధైర్యం కల్పించారు. జరిగిన నష్టాన్ని స్వయంగా చూడడంతో నిన్న వరద బాధితుల కోసం ఆర్థిక సహాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.25వేల చొప్పున అందించాలని నిర్ణయించారు. అలాగే.. తక్కువ నష్టం జరిగిన వారికి తక్కువ పరిహారాన్ని ప్రకటించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ స్థాయి నిర్ణయం తీసుకున్నారు.ఇటు.. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని చూసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఇతర మంత్రులు ఖమ్మం బాట పట్టారు. ప్రజలు తాము నష్టాన్ని వారి ముందుంచారు. వారు వెళ్లి వచ్చి వారం రోజులు అవుతోంది. ఇక ఇదే జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు ఉన్నప్పటికీ వారు చివరి వరకు ఉండి భరోసా కల్పించలేకపోయారనే అపవాదు ఉంది. మరోవైపు.. వరద నష్టాన్ని చూసేందుకు ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం సైతం పర్యటించింది. అక్కడి నష్టాన్ని అంచనా వేసింది. అంతకుముందు కేంద్ర మంత్రులు కూడా ఏరియల్ సర్వే చేశారు. దాంతో ప్రజలు తమకు తొరగానే పరిహారం వస్తుందని సంతోష పడ్డారు.ఇప్పటికే సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో జరిగిన నష్టంపై అటు కేంద్ర బృందాలు, ఇటు రాష్ట్ర బృందాలు సర్వేలు చేశాయి. వరద నష్టంపై సర్వే రిపోర్టులు సైతం ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే.. కేంద్ర బృందాలతో భేటీ సందర్భంగా భారీగా నష్టపోయామని, సాయం చేయాలని సీఎం రేవంత్ కోరారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఖమ్మం బాధితులకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇంతవరకు పరిహారం ప్రకటించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో పరిహారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వీలైనంత త్వరగా పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *