సిరా న్యూస్,,గుంటూరు;
గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కిడ్నీలా.. ఇడ్లీలా? 30 రూపాయలకు ప్లేట్ ఇడ్లీ అన్నంత ఈజీగా 30లక్షలకు ఓ కిడ్నీ అంటూ దందా చేస్తున్నారు కేటుగాళ్లు. సామాన్యుల కష్టాలను క్యాష్ చేసుకుంటున్నారు. బాధితులను నిందితులుగా చేస్తోన్న నయవంచన ఇప్పుడు మరో లెవల్. ఏపీలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసుతో సంబంధం ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా వారి కూడా వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు పోలీస్ అధికారులుగుంటూరు జిల్లాలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నీ మార్పిడి రాకెట్‌పై గుంటూరు పోలీసులు విస్తృతంగా విచారణ చేపట్టారు. ఐపీసీ సెక్షన్‌లు 370, 470, 465, 466, 468, 471, 120(బి)తోపాటు మానవ అవయవాల మార్పిడి చట్టంలోని సెక్షన్ 18, 19, 20 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1, ఏ3 ముద్దాయిలను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు బాషా, సుబ్రమణ్యంలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించారు పోలీసులు. మరో ముగ్గురి కోసం గాలిస్తు్న్నట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు ఈ రాకెట్‌ను సీరియస్‌గా తీసుకున్న హోంమంత్రి వి అనిత గుంటూరు ఎస్పీ, విజయవాడ పోలీసు కమిషనర్‌తో పాటు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సమగ్ర విచారణ జరిపి అందులో ప్రమేయం ఉన్న వారందరినీ పట్టుకోవాలని ఆదేశించారు.నిందితులు ఇద్దరిని అరెస్టు చేసిన గుంటూరు నగరంపాలెం పోలీసులు.. విచారణ అనంతరం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఆర్థిక ఇబ్బందులతో మధుబాబు అనే వ్యక్తి కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే, డాక్టర్లు, మధ్యవర్తి, కిడ్నీ గ్రహిత తనను దారుణంగా మోసం చేశారని.. రూ. 30 లక్షలు ఇస్తామని చెప్పి లక్ష కూడా ఇవ్వలేదని బాధితుడు మధుబాబు పోలీసులను ఆశ్రయించాడు. ఎడమ వైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి కుడి వైపు కిడ్నీ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని తనకు న్యాయం కావాలని అధికారులను ఆశ్రయించారు. ఈ ఘటనపై అటు ప్రభుత్వం సైతం సీరియస్ అయింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్పెషల్ టీమ్స్‌తో విచారణను వేగవంతం చేశారు. మరో ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని, దీని వెనుక ఎవరెవరూ ఉన్నారో తేలుస్తామని చెప్పారు డీఎస్పీ మహేష్.