కోటం..ఆనం…హ్యీపీయేనా

సిరా న్యూస్,నెల్లూరు;
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. పార్టీలు మారడం అంటూ జరిగితే వారికి ఓటమి తప్పదని గత ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. 2014లో వైసీపీ నుంచి టీడీపీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. అయితే అందులో కొందరికే చివరకు సీటు దక్కింది. సీటు దక్కిన వారిలో ఒక్కరంటే ఒక్కరే గెలిచారు. అదీ అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ మాత్రమే. పార్టీ మారిన మిగిలిన వాళ్లంతా ఓటమి పాలయ్యారు. అంటే పార్టీ మారిన వాళ్లను ప్రజలు ఆదరించరన్న సత్యం నాడే బోధపడింది. అయినా పార్టీలు మారడం మాత్రం ఆగడం లేదు. అనేక కారణాలతో పార్టీలు మారడం నేతలు అలవాటుగా మార్చుకున్నారు. కొన్ని సార్లు వాళ్లు మారాలని భావించకపోయినా పరిస్థితులు కలసి వస్తుండటంతో జెండాను మార్చేయడం మరికొందరికి తప్పనిసరిగా మారింది.2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. ఒక రకంగా వారు పార్టీకి దూరమయ్యారు. పార్టీ సస్పెండ్ చేసినట్లు పైకి చెబుతున్నా అందుకు ముందు నుంచి వినపడుతున్న కారణాలతో ఆ నలుగురు పార్టీ నుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్లపై వైసీీపీ అధినాయకత్వం వేటు వేసింది. వాళ్లు అంతకు ముందుగానే టీడీపీలోకి టచ్ లోకి వెళ్లారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో క్రాస్ ఓటింగ్ సాకు చూపి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే వైసీపీ నుంచి సస్పెండయి టీడీపీలో చేరిన నలుగురి ఎమ్మెల్యేలలో ఇద్దరికి మాత్రమే టీడీపీ సీట్లు కేటాయించింది. బలమైన అభ్యర్థితో… నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి టీడీపీ నుంచి పోటీ చేశారు. 2014లో వైసీపీ నుంచి తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు వైసీపీ అధికారంలోకి రాకపోయినా జగన్ వెంటే నడిచారు. 2019 ఎన్నికల్లో తిరిగి వైసీపీ టిక్కెట్ మీద పోటీ చేసి గెలుపొందారు. అయితే తర్వాత వైసీపీకి అనేక కారణాలతో దూరమయ్యారు. ఆయన నేరుగా నారా లోకేష్ ను కూడా కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. పట్టున్న నేతగా ఆయనకు పేరుంది. అలాంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి మారి మూడో సారి తన లక్ ను పరీక్షించుకుంటున్నారు. అయితే ఆయనకు పోటీగా బలమైన నేత, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు అంత సులువు కాదన్నది వాస్తవం. కాకపోతే పేరుకు రూరల్ నియోజకవర్గమైనా అర్బన్ లోనూ ఎక్కువ ఓట్లు ఉండటం, అది టీడీపీకి సానుకూలంగా మారుతుందన్న నమ్మకంతో కోటంరెడ్డి ఉన్నారు. కానీ ఆదాలకే ఎడ్జ్ కనిపిస్తుందన్నది విశ్లేషకుల అంచనా.నెల్లూరులో బలమైన కుటుంబానికి చెందిన లీడర్ ఆనం రామనారాయణరెడ్డి. ఆయన 2014లో టీడీపీ చేరారు. కానీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పుడు ఎన్డీఏకు అంతగాలి వీచినా ఆయనకు గెలుపు దక్కలేదు. దీంతో 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అయితే ఆయనకు ఈసారి వెంకటగిరి నియజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అసంతృప్తితో పార్టీపై వ్యతిరేక కామెంట్స్ చేశారు. చివరకు మళ్లీ టీడీపీలో చేరి ఈసారి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి గెలవడం అంత సులువు కాదు. మేకపాటి విక్రమ్ రెడ్డితో ఆయన తలపడ్డారు. ఈసారి కూడా ఆనం గెలవకపోతే రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెత్త రికార్డు ఆయన ఖాతాలో నమోదవుతుంది. సంక్షేమ పథకాలు, మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం వంటివాటితో విక్రమ్ రెడ్డి గెలుపు సులువు అన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. మొత్తం మీద సింహపురిలో ఈ ఇద్దరు రెడ్లు పార్టీలు మారి కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *