Kundurpi: చెప్పును తీసేందుకెళ్లి.. ఊబిలో చిక్కుకుని..

సిరాన్యూస్,కుందుర్పి
చెప్పును తీసేందుకెళ్లి.. ఊబిలో చిక్కుకుని..
* చెరువు కుంటలో ఇద్ద‌రు మృతి
* కుందుర్పి మండలంలో విషాద‌ఛాయ‌లు

చెప్పు జారిందని చెరువులో దిగిన బాలుడు మృతి చెంద‌గా, బాలుడిని కాపాడటానికి వెళ్లిన యువ‌కుడు కూడా మృతి చెందిన సంఘ‌టన బుధ‌వారం ఉద‌యం కుందుర్పి మండ‌లంలో చోటు చేసుకుంది. గ్రామ‌స్తులు, ఉపాధ్యాయులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కుందుర్పి మండల కేంద్రంలోని జ‌డ్పీహెచ్ఎస్ పాఠ‌శాల‌లో కుందుర్పి గ్రామానికి చెందిన సజ్జల అంగడి నాగేంద్ర కుమారుడు విష్ణు (11) 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. బుధ‌వారం పాఠ‌శాల‌కు వ‌చ్చిన విద్యార్థి విష్ణు ఇంటర్వెల్ (విరామ స‌మ‌యం)లో బ‌హిర్భూమికి అని ప‌క్క‌నే ఉన్న చెరువు కుంట వ‌ద్ద‌కు వెళ్లాడు. ఈ క్ర‌మంలో విద్యార్థి విష్ణు కాలి చెప్పు చెరువు కుంట‌లో ప‌డింది. చెప్పు తీసేందుకు చెరువులో దిగిన విద్యార్థి విష్ణు ఊబిలో చిక్కుకుని ఊపిరాడ‌క కేక‌లు పెట్టాడు. కేక‌లు విని చుట్టు ప‌క్క‌నే ఉన్న కంసాల నవీన్ (25) ఆ విద్యార్థిని కాపాడడానికి పోయి ఇతను కూడా ఊబిలో ఇరుక్కుని చని పోయాడు. మిగిలిన విద్యార్థులు వెంటనే అక్కడ ఉన్న స్కూల్ టీచర్ చెప్పడంతో టీచర్లు, గ్రామస్తులు సంఘ‌ట‌న స్థ‌లాన్ని చేరుకున్నారు. అప్ప‌టికే యువ‌కుడు నవీన్ మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న విష్ణును వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ విష్ణు మృతి చెందాడు. ఇద్ద‌రు ఒకేసారి మృతి చెంద‌డంతో కుందుర్పి మండలంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *