సిరా న్యూస్, జైనథ్:
శ్రీ లక్ష్మీ నారాయణుడికి సూర్య భగవానుడి అభిషేకం…
+ స్వామివారి పాదాలను తాకిన సూర్యకిరణాలు
+ తరలివస్తున్న భక్తులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకుతున్నాయి. శనివారం వేకువ జామున లేలేత సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై ప్రసరించాయి. దీంతో స్వామివారు బంగారు వర్ణంతో శోభాయమానంగా వెలుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సదర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 14 వ శతాబ్దంలో నిర్మించిన అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో ప్రతి ఏటా స్వామివారి పాదాలను నేరుగా సూర్యకిరణాలు అభిషేకించడం జరుగుతుంది. ఆలయం ముందర ఉన్న కోనేరు మీదుగా సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న స్వామివారి పాదాలను అభిషేకించే విధంగా ఆలయాన్ని నిర్మించారు. సూర్య భగవానుడే స్వామివారిని అభిషేకించే ఈ మహత్తర దృగ్విషయాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏటా వేలాదిగా భక్తులు తరలి రావడం జరుగుతుంది. కాగా ఈ ఏడాది ప్రస్తుతం ఆలయంలో స్వామి వారి పాదాలను సూర్యకిరణాలు తాకడం ప్రారంభమైందని, మరో రెండు, మూడు రోజుల పాటు ప్రతిరోజు సూర్య కిరణాలు స్వామివారి పాదాలపై ప్రసరిస్తాయని స్థానికులు చెబుతున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.