సిరా న్యూస్, జైనథ్:
లక్ష్మీపూర్‌లో ఆధ్యాత్మిక శోభా…
+ రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్వం సిద్ధం
+ ఈ నెల 24, 25, 26 తేదీల్లో ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామంలో కొన్ని ఏండ్లుగా రామాలయం నిర్మాణం కోసం గ్రామస్తులు కృషీ చేస్తున్నారు. అయితే నిధుల కొరత, ఇతరాత్ర కారణాల వల్ల ఆలయ నిర్మాణంలో కొంత జాప్యం అయ్యింది. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని కంకణబద్దులై, వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరో వస్తారు.. ఎదో చేస్తారు అని ఎదురు చూడకుండా భక్తుల వద్ద నుండి విరాళాలు సేకరించి ఆలయాన్ని పూర్తి చేసారు. స్వగ్రామం నుండి వివిద ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార రిత్యా నివసిస్తున్న వారిని కలిసి విరాళాలు స్వీకరిస్తున్నారు. ఆదిలాబాద్, హైదరబాద్, ఇతరాత్ర ప్రాంతాల్లో ఉంటున్న వారి ఇండ్లకు వెళ్ళి రామాలయ ఆహ్వన పత్రికను స్వయంగా అందజేస్తున్నారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

మూడు రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు…
ఇలా ఇంటింటికి తిరుగుతూ ఆహ్వాన పత్రిక అందజేయడం విరాళాలు పోగు చేయడానికే కాకుండా, గ్రామ సమగ్ర ఐక్యతకు దోహదపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు. కుల, మతాలకు అతీతంగా అందరికి ఆహ్వానం అందిస్తున్నామని, దీంతో గ్రామంలో సామరస్యం కూడ సాధించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇలా పోగైన విరాళాలతో ఇటీవలే రామాలయంలో ప్రతిష్ఠించనున్న నూతన దేవతా విగ్రహాలను సైతం తెప్పించారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి, శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠాపన చేపట్టనున్నారు. 24న ఉదయం యాగశాల, తోరణపాకు, అలంకరణ, మహాగణపతి పూజ, పుణ్యహవచనము, యాగశల ప్రవేశం, దీక్షా కంకణధారణ, అఖండ దీపస్థాపన, అంకురారోపన, పంచగ్యప్రాసన, బ్రహ్మ కలశస్థాపన, సర్వతోభద్రమండలి ఆవాహానాలు, యంత్రాలకు పంచామృతాల స్తపనం, సర్వదేవతా హోమము, జలా«ధివాసం, నైవేద్య నిరాజనం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 25న వేదపారాయణము, తీర్థనయనం, యంత్రస్థాపనములు, ఉపవేధిక హోమములు, అమ్మవారికి విగ్రహాలకు అభిషేకాలు, గ్రామోత్సవం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, శయ్యాదివాసం, నిరాజనం, నైవేద్యం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. చివరి రోజైన 26న వేదపారయణము, యంత్రానుష్టానములు, ఆలయ సంస్కారం, వాస్తు పూజలు, పరియజ్ఞీకరణ, రత్నవ్యాసము, ధాతువ్యాసము, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నాను. దీంతో పాటు భక్తుల సౌకర్యార్థం మహాన్నదాన కార్యక్రమం సైతం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు. కావున భక్తులంత పెద్ద ఎత్తున తరలివచ్చి, రాములోరి కృపకు పాతృలు కావాలని కోరుతున్నారు.