సిరా న్యూస్,విజయవాడ;
అధికారంలో ఉన్ననాళ్లు పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు పవర్ పోగానే పార్టీని వదిలిపోతున్నారు. పెద్ద పెద్ద నేతలే పార్టీని వదిలివెళుతున్నప్పుడు ఇక కిందిస్థాయి నేతల గురించి ఆలోచించాల్సిన పనిలేదేమో. ఎందుకంటే మేయర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారడం సర్వసాధారణం. అలాగే సర్పంచ్ లు, ఎంపీటీసీ, జడ్‌పీటీసీలు, వివిధ సంస్థల ఛైర్మన్లు కూడా ఐదేళ్లు అధికార పార్టీలో ఉండాలని కోరుకుంటారు. ఇదంతా ఒక ఎత్తయితే జగన్ అసలు ఏరికోరి పదవులు ఇచ్చిన వాళ్లే కష్ట సమయంలో కాడిని వదిలేసి వెళ్లడం నిజంగా జగన్ ఎంపికలో లోపమేనని అంటున్నారు. పార్టీ విధేయత, తన పట్ల నమ్మకం ఉన్న వారిని పక్కన పెట్టి మరీ పదవులు ఇచ్చి ఇప్పుడు వారిని అనుకుని ఏం లాభం అన్న ప్రశ్న తలెత్తుతుంది.. నిజానికి కిలారి రోశయ్య ఎమ్మెల్యే అయ్యారంటే అది జగన్ చలవే. ఎందుకంటే జగన్ 2019 లో సీటు ఇవ్వకపోతే కిలారి రోశయ్య అసలు రాజకీయాల్లోకి వచ్చేవారే కాదు. ఆయనకున్న ఏకైక క్వాలిఫికేషన్.. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కావడమే. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉండటంతో ఆయన ముఖం చూసి జగన్ కిలారి రోశయ్యకు టిక్కెట్ ఇచ్చారన్నది అందరికీ తెలిసిందే. అలాగే ఆయన సొంత బలం మీద నాటి ఎన్నికల్లో గెలవలేదన్నది కూడా అంతే నిజం. నాడు 151 స్థానాలు వచ్చాయంటే అప్పుడు జగన్ చేసిన పాదయాత్రతో పాటు ఫ్యాన్ గాలి బలంగా వీయడంతోనే కిలారి రోశయ్య గెలిచాడుఅయితే ఇప్పుడు ఏం మునిగి పోయిందని కిలారి రోశయ్య పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఒక సీనియర్ నేత ప్రశ్నించడం ఇందుకు అద్దం పడుతుంది. ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినందుకు, రెండో సారి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు పార్టీకి రాజీనామా చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి కిలారి రోశయ్యకు అప్పటి వరకూ రాజకీయ చరిత్ర లేదని ఆయనకు తెలుసు. అందరికీ తెలుసు. కానీ వైసీపీ వల్లనే ఎమ్మెల్యేగా అయినా గెలిచారంటారు. అలాంటి కిలారి రోశయ్య ఇప్పుడు రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జగన్ కు ఇప్పుడు అర్థమయి ఉండాలి. అలాగే అన్ని సార్లు పదవులు ఇచ్చిన ఆళ్లనాని కూడా అంతే. ఇక మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల నాని కూడా పార్టీ నుంచి వైదొలిగారు. గతంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరారు. ఆయన ఖాళీ చేసిన పదవిని ఆయనకే ఇచ్చారు వైెస్ జగన్. పోతుల సునీత కూడా అంతే. టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్సీ పదవి తిరిగి ఆమెకే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆమె పార్టీని వదిలిపోయారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో పెండెం దొరబాబు పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే. ఇక బీద మస్తాన్ రావు కూడా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వెంటనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన పార్టీలకు రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. ఇలా పదవులు ఇచ్చిన వారే వెళ్లిపోతున్నారు.
టీడీపీలో చేరితే…భవిష్యత్తేనా
తెలుగుదేశం పార్టీకి ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. సీనియర్ నేతల నుంచి యువనేతలతో ఆ పార్టీ ఫుల్లు అయిపోయింది. ఇప్పటికే కూటమి ఏర్పడటంతో మిత్ర పక్షాలకు అసెంబ్లీ స్థానాలను సర్దుబాటు చేయాల్సి రావడంతో అనేక మంది టీడీపీ నేతలు తమ టిక్కెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. వారంతా ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ఎమ్మెల్సీ పోస్టు కోసం, మరికొందరు రాజ్యసభ స్థానాల కోసం వెయిట్ చేస్తున్నారు. సుదీర్ఘకాలం నుంచి పార్టీకి సేవలందించిన నేతలకు చంద్రబాబు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే టీడీపీ ఓడిపోయినా నమ్మకంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు ఖచ్చితంగా పదవులు దక్కుతాయి. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి జంప్ అవుతున్న నేతలకు ఆ పార్టీలో ఎంత మేరకు భవిష్యత్ ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికే చంద్రబాబు కండిషన్లు పెట్టారు. టీడీపీలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాలని చంద్రబాబు తెలిపారు. అయినా పార్టీ మారి వచ్చే నేతల వ్యక్తిత్వాన్ని పరిశీలించిన తర్వాతనే తాము కండువా కప్పుతామని చెప్పారు. అంటే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి రావాలంటూ చంద్రబాబు నేరుగా సంకేతాలు ఇచ్చారు. అలా వచ్చిన వారినే టీడీపీలోకి చేర్చుకుంటామని తెలిపారు. అయితే నియోజకవర్గాల్లో వారి బలాన్ని బట్టి తమ నిర్ణయం ఉంటుందని కూడా టీడీపీ చీఫ్ తెలిపారు.2014 లో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. అందులో నలుగురు మినహా మిగిలిన నేతలు ఎవరినీ ప్రజలు ఆదరించలేదు. చంద్రబాబు టిక్కెట్ కూడా ఇవ్వలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన అమర్‌నాధ్ రెడ్డి, కడప నుంచి ఆదినారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ మాత్రమే కొంత రాజకీయాల్లో నిలదొక్కుకోగలిగారు. మిగిలిన జంప్ చేసిన నేతలు దాదాపుగా ఫేడ్ అవుట్ అయ్యారు. ఇప్పుడు కూడా పార్టీ మారిన నేతలకు ఫ్యూచర్ గ్యారంటీ అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే పదవుల్లో ప్రయారిటీ ఈ ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ నేతలకే ఉంటుంది. తప్పించి పార్టీ మారి వచ్చిన నేతలకు ఆ హామీ కూడా టీడీపీ హైకమాండ్ ఇవ్వడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని, తమకు సీటు వస్తుందని ఆశించినా చివర వరకూ టిక్కెట్ దక్కుతుందన్న ఆశలేదు. 2029 ఎన్నికల్లో కూడా కూటమి పోటీచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటు జనసేన, అటు బీజేపీలోనూ టిక్కెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రానున్న కాలంలో జనసేన, బీజేపీలో చేరతారు. గత ఎన్నికల్లోనూ కొందరు టీడీపీ నేతలు ఇక్కడ టిక్కెట్ రాదని ముందుగానే తెలిసి జాగ్రత్త పడి జనసేన, బీజేపీలో చేరి టిక్కెట్ పొందారు. దీంతో ఇప్పుడు పార్టీ మారే నేతలకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. కాకుంటే ఈ ఐదేళ్ల పాటు అధికార పార్టీలో ఉన్నామన్న ఏకైక కారణంతోనే మారాల్సి ఉంటుంది. అంతకు మించి పార్టీ ఎవరు మారినా రాజకీయంగా దారుణంగా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు.