రుణమాఫీ కాలేదు… వడ్డీలు కట్టండి

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో చాలామంది రైతులు దిక్కుతొచని పరిస్థితుల్లో ఉన్నారు. ఓవైపు ప్రభుత్వం రుణమాఫీ చేశామని.. చేస్తామని చెబుతోంది. మరోవైపు రుణ మాఫీ కాలేదు.. వడ్డీలు చెల్లించాలని బ్యాంకులు, సహకార సంఘాలు హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు రోడ్డెక్కుతున్నారు. బ్యాంకుల ముందు ఇంకా బారులు తీరుతున్నారు.పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆగస్టు నెలాఖరులోగా రుణమాఫీ పూర్తవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని మంత్రులు స్పష్టం చేశారు. కానీ.. ప్రభుత్వం చెప్పిన గడువు ముగిసి నెల రోజులు గడుస్తున్నా.. సంపూర్ణ రుణ మాఫీ కాలేదు.జులై 18న అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.1 లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేశారు. వడ్డీతో పాటు.. లక్ష వరకు ఉన్న రుణం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. జులై 31వ తేదీ నుంచి రూ.1.50 లక్షల రుణం ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. జులై 31 వరకు మొత్తం 18 లక్షలకు పైగా రైతులకు లబ్ధి చేకూరిందని వివరాలు వెల్లడించింది.రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు తీసుకున్న రుణాలను ఆగస్టు 14 తేదీలోపు మాఫీ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి రుణమాఫీ లిస్ట్ అధికారులు విడుదల చేశారు. కానీ.. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు ఇంకా మాఫీ కాలేదు. దీంతో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికీ వేలాది మంది రైతులకు సంపూర్ణ రుణమాఫీ కాలేదు. తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించాలని బ్యాంకులు, సహకార సంఘాలు రైతులపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా.. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రుణమాఫీ కాలేదని రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. రుణమాఫీ కాలేదని, కొత్త రుణాల మంజూరులో బ్యాంకర్లు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్బీఐ బ్యాంకు ముందు రోడ్డుపై బైఠాయించారు.గతంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేస్తామని.. ఆందోళన చెందవద్దని సూచించారు. కొన్ని సాంకేతిక కారణాలతో రుణ మాఫీ కాలేదని.. త్వరలోనే సమస్యలు పరిష్కరించి రుణ మాఫీ చేస్తామని చెప్పారు. మంత్రులు ఈ మాట చెప్పి 20 రోజులు గడుస్తోంది. అయినా రుణ మాఫీ కాలేదు. దీంతో రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *