Loka Praveen Redddy: బీజేపీకి బై బై చెప్పనున్న లోక ప్రవీణ్‌ రెడ్డి…!?

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

బీజేపీకి బై బై చెప్పనున్న లోక ప్రవీణ్‌ రెడ్డి…!?
+ జిల్లా అధ్యక్ష పదవి దక్కకపోవడంతో అలక
+ కాంగ్రేస్‌లో చేరనున్నట్లు వార్తలు
+ 2న సీఎం ఆధ్వర్యంలో కాంగ్రేస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు సంకేతాలు

బీజేపీ పార్టి ఆదిలాబాద్‌ జిల్లా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌కు అత్యంత సన్నిహుతుడైన లోక ప్రవీణ్‌ రెడ్డి బీజేపీని వీడనున్నట్లు సమాచారం. ఇటీవల పాయల్‌ శంకర్‌ ఎమ్మెల్యేగా గెలవడంతో, ఖాలీ అయిన బీజేపీ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్ష పదవి ఆశించిన లోక ప్రవీణ్‌ రెడ్డికి అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది. 1994 నుంచి ఏబీవీపీలో పనిచేస్తున్న లోక ప్రవీణ్‌ రెడ్డి, గడిచిన దశాబ్దం పాటు బీజేపీ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ 2018, 2024 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎదురొడ్డి నిలబడ్డారు. 2019లో మాజీ మంత్రి జోగు రామన్న స్వగ్రామమైన దీపాయిగూడ ఎంపిటీసీ స్థానాన్ని బీజేపీ చేజిక్కించుకోవడంలో క్రియాశీలక భూమిక పోషించారు. మాజీ మంత్రి జోగు రామ్నను కాదని దీపాయిగూడలో అతని సోదరుడు లోక కరుణాకర్‌ రెడ్డిని బీజేపీ నుంచి ఎంపిటీసీగా పోటీ చేయించి, గెలిపించుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఆదిలాబాద్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషీ చేసిన ఆయన, ఈ సారి బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి తనకేనని ధీమాగా ఉన్నారు. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో మంచి సత్సంబందాలు ఉండటంతో పాటు బీజేపీ రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి కేడర్‌తో కూడ పంచి పరిచయాలు ఉండటంతో అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకున్నారు.

అధిష్ఠానం నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిలో…
తనను వరిస్తుందని భావించిన అద్యక్ష పదవిని, ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల జడ్పిటీసీ పతంగే బ్రహ్మనందంకు కట్టబెట్టడంతో, లోక ప్రవీణ్‌ రెడ్డి తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. అధికార బీర్‌ఎస్‌కు ఎదురొడ్డి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కూడ, తనకు సరైన స్థానం లభించలేదని అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి రాకపోవడంతో అలక బూనిన లోక ప్రవీణ్‌ రెడ్డి, కాంగ్రేస్‌ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన కాంగ్రేస్‌ పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి సభలో, సీఎం చేతుల మీదుగా కాంగ్రేస్‌ కండువా కప్పుకునేందుకు సర్వం సిద్ధమైనట్లు వినికిడి. ఇదే నిజమైతే, విజయోత్సవంలో ఉన్న బీజేపీకి ఆదిలాబాద్‌లో గట్టి షాక్‌ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విషయమై ‘సిరా న్యూస్‌’ లోక ప్రవీణ్‌ రెడ్డిని ఫోన్‌లో సంప్రదించగా, ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమి లేదని, త్వరలోనే తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *