బీజేపీలో టిక్కెట్ల కోసం లొల్లి….

సిరా న్యూస్, హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్ర బీజేపీలో అప్పుడే ఎంపీ టికెట్ల కోసం నేతల మధ్య లొల్లి మొదలైంది. కరీంనగర్, మహబూబ్‌ ననగర్, మల్కాజ్గిరి, జహీరాబాద్ , చేవె్ళ్ల నియోజకవర్గాల్లో నేతల మధ్య పోటీ నెలకొన్నది. కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్‌కు తిరిగి టికెట్ ఇవ్వద్దంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి గతంలో సన్నిహితుడనే ముద్రపడ్డ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి, ఆ నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత సుగుణాకర్ రావుతో పాటు స్థానిక నేతలు కొందరు ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి సంజయ్ ఓడిపోయినందున తిరిగి పార్లమెంట్ టికెట్ ఆయనకు ఇవ్వొద్దనేది అక్కడి అసమ్మతి నేతల డిమాండ్. ఇక్కడి నుంచి పోటీకి ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన రాష్ట్ర బీజేపీలోని ఓ కీలక నేత ప్రయత్నాలు ప్రారంభించారు. మల్కాజిగిరి టికెట్ కోసం నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పార్టీ మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీసీ నేత తూళ్ల వీరేందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్.. ఇలా ఎవరికి వారే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేసేది నేనే.. అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకోవడంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. తాజాగా రాష్ట్ర బీజేపీ మరో కీలక నేత ఈటల రాజేందర్ కూడా కూడా నేను సైతం..అంటూ బహిరంగంగానే ప్రకటించడంతో మల్కాజిగిరి టికెట్ పోరు కమల దళంలో ఆసక్తికరంగా మారింది. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మిగతా వారు అసంతృప్తికి గురవుతారు.మహబూబ్ నగర్ సీటుపై కూడా తెలంగాణ పార్టీలో గా చర్చ సాగుతోంది. ఇక్కడి నుంచి పోటీకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లుగా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. 2019లో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆమె ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కమలం పార్టీ గుర్తు కింది స్థాయి వరకు వెళ్లకపోవడంతోనే తాను ఓటమి పాలయ్యాయని అరుణ చెబుతున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు డీకే అరుణ. ఇదిలాఉండగా.. గతంలో బీజేపీ, BRS నుంచి జితేందర్ రెడ్డి ఎంపీగా పనిచేశారు. ఈసారి జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తనకే ఎంపీ టికెట్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని కల్వకుర్తి ఆచారి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కల్వకుర్తి నుంచి ఆచారి బీజేపీ ఎమ్మెల్యేగా ఆరుసార్లు పోటీచేశారు. అయితే ఈసారి ఎంపీ టికెట్‌ ఇవ్వాలని ఆయన బీజేపీ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే మహబూబ్‌నగర్ నుంచి ఎవరికి బీజేపీ ఎంపీ టికెట్‌దక్కుతుందనేది స్థానికంగా ఆసక్తి నెలకొంది.తెలంగాణలోని చేవెళ్ల పార్లమెంట్‌ టికెట్‌ కోసం నేతల లాబీయింగ్ అనే అంశం చర్చనీయాంశమవుతోంది. ఎవరెవర్ని లాబియింగ్స్ చేసినా కూడా చేవేళ్ల నుంచి బీజేపీ టికెట్ తనకే దక్కుతుందని కొండా విశ్వేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే 2014లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కొండ విశ్వేశ్వర రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు కొండా విశ్వేశ్వర రెడ్డి. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీని కూడా వీడి చివరికి 2020లో బీజేపీలోకి చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చెవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో పట్టుబట్టి మరి తన వర్గీయులకు కొండా టికెట్లు ఇప్పించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *