సిరా న్యూస్,హైదరాబాద్;
మహాలక్ష్మి పేరుతో తెలంగాణలో మహిళలకు అందిస్తున్న ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే దీన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ ఆలోచన చేస్తోంది. ఉచిత ప్రయాణం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. త్వరలోనే లబ్ధిదారులకు ఈ కార్డులను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇప్పటి వరకు వివిధ వర్గాలకు అందజేస్తున్న బస్ పాస్ మాదిరిగానే ఈ మహాలక్ష్మి పథకం కార్డులు కూడా జారీ చేస్తారు. వీటిని కూడా మరింత స్మార్ట్‌గా మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇకపై అన్ని బస్‌పాస్‌లు కూడా స్మార్ట్‌గా మార్చేయనున్నారు.ఉచిత ప్రయాణలబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు ఇవ్వడంతోపాటు చిల్లర సమ్యలను అధిగమించేందుకు డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని బండ్లగూడ డిపోలోని కొన్ని బస్సుల్లో ఈ విధానం విజయవంతంగా అమలు అవుతుంది. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు అధికారులుడిజిటల్ పేమెంట్ కోసం ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ పేరుతో ఐటిమ్స్‌ను ప్రవేశ పెట్టింది. బండ్లగూడలోని బస్సులతోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో దీన్ని మూడు నెలలుగా అమలు చేస్తున్నారు. అక్కడ ప్రయోగం విజయవంతం కావడంతోపాటు వేరే సమస్యలు రాకపోవడం, చిల్లర బాధలు కూడా తీరడంతో తెలంగాణ వ్యాప్తంగా దీన్ని ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ ప్రవేశ పెట్టాలని ఆలోచనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ 10.97 కోట్ల రూపాయలతో 13వేల ఐటిమ్స్‌ను కొనుగోలు చేసింది. దీని ప్రకారం ప్రయాణికుడి వద్ద నగదు లేకపోయినా కార్డు, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి పేమెంట్స్ యాప్స్ ఉంటే చాలు. వాటి ద్వారా డబ్బులు చెల్లించి టికెట్ తీసుకునే వెసులుబాటు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో రానుంది.వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఐటిమ్స్ పనితీరు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాలను తెలంగాణ ఆర్టీ అధికారులు పరిశీలించారు. బిహార్, ముంబై లాంటి ప్రాంతాల్లో విజయవంతంగా ఈ వ్యవస్థ అమలు అవుతుందని తేల్చారు. ఇక్కడ కూడా అమలు చేసే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని బస్సుల్లో అమలు చేశారు. అక్కడ కూడా విజయవంతం కావడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జులై ఆఖరిలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రారంభంకానుంది. మొదటిసారిగా పదివేల బస్సుల్లో ఈ ఐటిమ్స్ వ్యవస్థను అమలు చేయనున్నారు. అదే టైంలో మహిళలకు మహాలక్ష్మి కార్డులు కూడా ఇవ్వనున్నారు.
========================