Maxwell on fire..మాక్స్‌వెల్ విధ్వంసం.. ఆస్ట్రేలియా విజయం

సిరా న్యూస్, స్పోర్ట్స్:

మాక్స్‌వెల్ విధ్వంసం.. ఆస్ట్రేలియా విజయం..

నూజిలాండ్ పర్యటనలో ఆస్ట్రేలియా వరుస విజయాలతో సత్తాచాటుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆసీస్ ఆఖరి టీ20లోనూ గెలిచింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 27 పరుగుల తేడాతో నెగ్గింది.మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా సాగలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 10.4 ఓవర్ల పాటు మాత్రమే ఇన్నింగ్స్ ఆడింది. నాలుగు వికెట్లకు 118 పరుగులు చేసింది. ఆదిలోనే ఓపెనర్ స్టీవ్ స్మిత్ (4; 3 బంతుల్లో) ఔటయ్యాడు. మరో ఓపెనర్ ట్రేవిస్ హెడ్ (33; 30 బంతుల్లో)తో వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ షార్ట్ (27; 11 బంతుల్లో) స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.షార్ట్ దూకుడుగా ఆడటంతో పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా 67 పరుగులు చేసింది. షార్ట్ ఔటైనా క్రీజులోకి మాక్స్‌వెల్ రావడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. మాక్సీ తొమ్మిది బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. జోస్ ఇంగ్లిష్ (14*; 8 బంతుల్లో), టిమ్ డేవిడ్ (8*; 3 బంతుల్లో) కుదురుకునే సమయానికి వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. కివీస్ బౌలర్లలో మిల్నీ, బెన్ సీర్స్, శాంటర్న్, క్లార్క్‌సన్ తలో వికెట్ తీశారు.ఆటకు అంతరాయం కలగడంతో అంపైర్లు రెండో ఇన్నింగ్స్‌ను పది ఓవర్లకు కుదించారు. న్యూజిలాండ్‌కు పది ఓవర్లలో 126 పరుగుల లక్ష్యంగా నిర్దేశించారు. ఛేదనలో కివీస్ 10 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులే చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (40; 24 బంతుల్లో) పోరాడాడు. సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఫిలిప్స్ పోరాటం వృథాగా మారింది.ఫిన్ అలెన్ (13; 9 బంతుల్లో), విల్ యంగ్ (14; 7 బంతుల్లో), టిమ్ సీఫెర్ట్ (2; 5 బంతుల్లో), మార్క్ ఛాప్‌మన్ (17*; 15 బంతుల్లో) పరుగులు చేశారు. మాథ్యూ షార్ట్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో వికెట్ తీశారు.కాగా, న్యూజిలాండ్ పర్యటనలో ఆస్ట్రేలియా మూడు టీ20లతో పాటు రెండు టెస్టులు ఆడనుంది. వెల్లింగ్టన్ వేదికగా ఫిబ్రవరి 29 నుంచి తొలి టెస్టు, మార్చి 8వ తేదీ నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *