తెలంగాణలో మయోనైజ్ బ్యాన్

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్న మయోనైజ్‌‌ను రాష్ట్రంలో నిషేధిస్తూ తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో పలు హోటళ్లు, ఫుడ్‌స్టాళ్లలో తరచూ ఎంక్వైరీలను చేయాలని సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా మంత్రి కీలక సూచనలు చేశారు.రాష్ట్రంలో నూతనంగా 3 ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు, 5 మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని దామోదర రాజనర్సింహా ఆదేశించారు. కల్తీ ఆహారపదార్థాల్ని తీసుకొని పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతోన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఈ మయోనైజ్‌ను ఎక్కువగా మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటున్నారని, చాలా చోట్ల దీనిలో కల్తీ జరుగుతోందని ఆయన వివరించారు. గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారు చేస్తారని, ఇది ఉడికించని పదార్థం కావడం వలన హానికర బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెందుతుందని అధికారులు తెలిపారు.హైదరాబాద్ బంజారాహిల్స్‌ నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరిశంకర్‌కాలనీలలో గత శుక్రవారం జరిగిన సంతలో ‘దిల్లీ హాట్‌ మోమోస్‌’ దుకాణంలో విక్రయించిన నాన్‌వెజ్మోమోస్, వాటితో పాటు ఇచ్చిన మయోనైజ్, చట్నీని బస్తీకి చెందిన రేష్మబేగం అనే మహిళ, ఆమె పిల్లలు రుమ్షా, రఫియాలు తిన్నారు. అదేరోజు రాత్రి ముగ్గురికీ విరోచనాలు, వాంతులు అయ్యాయి. పిల్లలిద్దరినీ హాస్పిటల్లో చేర్చగా తల్లి ఇంట్లోనే ఉంది. రేష్మబేగం (31) ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించింది. గతంలో అల్వాల్‌లోని గ్రిల్‌ హౌజ్‌ హోటల్‌లో నాసిరకమైన మయోనైజ్‌ను తిన్న కొందరు యువకులు ఇటీవల హాస్పిటల్ పాలయ్యారు. ఈ కేసులో పోలీసులు ఇవాళ మోమోస్ విక్రయించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ హోటళ్లు తీరు మారట్లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి కోరింది.
ఓ మహిళ మోమోస్‌ తిని మరణించిందంటే బయట భోజనం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. మృతి చెందిన మహిళతో పాటు అదే దుకాణంలో మోమోస్ కొని తిన్న మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతి చెందిన మహిళతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు కూడా మోమోస్ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోమోస్‌ విక్రయదారుడిని అదుపులోకి తీసుకున్నారు. సరే, ఇప్పుడు మోమోస్ ఒకరిని ఎలా చంపగలవు అనే ప్రశ్న తలెత్తుతుంది? ఈ రోజు ఈ వార్తలో దీని గురించి వివరంగా తెలుసుకుందాం.మోమోస్‌ను తయారు చేయడానికి శుభ్రమైన, మంచి పదార్థాలను ఉపయోగించకపోతే ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. ఇది కాకుండా, కలుషితమైన నీరు, కుళ్ళిన మాంసం లేదా చెడిపోయిన కూరగాయలను మోమోస్ తయారీలో ఉపయోగించినట్లయితే, వినియోగదారుడు సెప్టిక్ షాక్‌కు గురవుతారు. ఈ పరిస్థితిలో సాల్మోనెల్లా లేదా ఇ.కోలి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ప్రాణాంతకం కావచ్చు.మోమోస్ తయారీలో సరైన పదార్థాలను ఉపయోగించినప్పటికీ, సరిగ్గా ఉడికించకపోయినా, అది ప్రాణాంతకంగా మారవచ్చు. నిజానికి, సాధారణంగా మోమోస్‌లో నింపడానికి ఉపయోగించే పచ్చి లేదా తక్కువగా ఉడికించిన మాంసం ఆరోగ్యానికి ప్రమాదకరం. అటువంటి పరిస్థితిలో, మోమోస్ సరిగ్గా ఉడకకపోతే, వాటిని తినే వ్యక్తి గ్యాస్ట్రోఎంటెరిటిస్ బారిన పడతాడు. దీని కారణంగా, శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. రోగి వాంతులు, విరేచనాలు, తీవ్రమైన నొప్పితో బాధపడవచ్చు. సకాలంలో చికిత్స అందకపోతే, మోమోస్ తినే వ్యక్తి చనిపోవచ్చు. ఇది కాకుండా, మోమోస్ తయారీలో ఉపయోగించే మసాలా దినుసులు కల్తీ అయితే, అది మోమోస్ తినే వ్యక్తి మరణానికి కూడా దారి తీస్తుంది. అతను చనిపోకపోయినా, అతను తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *