సిరాన్యూస్, సామర్లకోట
గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు: కాండ్రకోట వైద్యాధికారి డాక్టర్ నవీన్
* కట్టమూరులో ఉచిత పశు వైద్య శిబిరం
గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలని కాండ్రకోట వైద్యాధికారి డాక్టర్ నవీన్ అన్నారు. శనివారం కాకినాడ జిల్లా పశుసంవర్ధక శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా కాండ్రకోట వైద్యాధికారి డాక్టర్ నవీన్ మాట్లాడుతూ ఈ వర్షాకాల సీజన్లో పశువులలో గాలికుంటు వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ వ్యాధి నివారణకు టీకాలు ఒకటే నివారణ అన్నారు. ఆ వ్యాధి గాని పశువులకు వస్తే పశువులు మరణించే అవకాశం ఎక్కువగా ఉందని, దీని నివారణకు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని తెలియజేశారు.ఈ శిబిరంలో దాదాపు 30 మంది రైతులకు సంబంధించి 136 పశువులకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయడం జరిగిందని తెలియజేశారు. అనంతరం రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ బర్రె నాగేశ్వరావు మాట్లాడుతూ పాడి రైతులు ఈ వర్షా కాల సమయంలో పశువులు వ్యాధులు బారిన పడకుండా సరైన సమయంలో టీకాలు వేయించుకుని పశు సంపదని రక్షించుకోవాలని అన్నారు. వీటితోపాటు రైతులు పశువులలో గాని ,వ్యవసాయం గురించి గానీ అలాగే వాతావరణం గురించి తెలుసుకోవడానికి రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ కి ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు ఫోన్ చేసి సమాచారంను పొందవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు కే వెంకట్రావు, బి సూరిబాబు, వి అప్పారావు , పశు వైద్య సిబ్బంది వి ఎల్ వో జి అచ్చయ్య, ఎన్ ఈశ్వర్ , కే శరత్ , రిలయన్స్ ఫౌండేషన్ సిబ్బంది యు రమేష్ బాబు పాల్గొన్నారు.