మొదటి వారంలో మెగాడీఎస్సీ నోటిఫికేషన్

సిరా న్యూస్,అమరావతి;
ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ నోటిఫకేషన్‌ విడుదలలో స్వల్ప జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టెట్‌ పరీక్షలు పూర్తి కావడంతో తొలుత నవంబర్‌ రెండో తేదీలోగా టెట్ 2024 ఫలితాలను వెల్లడించనున్నారు. టెట్ ఫలితాలు వెలువడిన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందని విద్యాశాఖ వర్గాలు మొదట ప్రకటించాయి. తాజాగా ఈ తేదీల్లో మార్పు ఉండొచ్చని చెబుతున్నారు. సాంకేతిక కారణాలతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విదేశీ పర్యటన నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలలో స్వల్ప మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబరు మొదటి వారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తొలుత 3వ తేదీన నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావించారు. ఆ రోజు ఆదివారం కావడంతో ముఖ్యమైన నాయకులు అందుబాటులో ఉంటారో లేదోననే సందేహంతో మరో తేదీలో నోటిఫికేషన్ విడుదల చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు.మరోవైపు నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత న్యాయ వివాదాలు సృష్టించే అవకాశాలు ఉంటాయని భావించిన ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ వర్గాలను ఆదేశించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్‌లోగా నియామకాలను భర్తీ చేస్తామని ప్రకటించినా టెట్‌ నిర్వహణతో పరీక్షలు, నోటిఫికేషన్ ఆలస్యమైంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మెగా డిఎస్పీలో ఎలాంటి న్యాయవివాదాలకు తావివ్వకుండా చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఇప్పటికే ఆదేశించారు.టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఇప్పటికే ఆశావహులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాలు మానుకుని పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగ ప్రకటన చేసిన ఆర్నెల్లకు మించి ఆలస్యమైతే అభ్యర్థుగా భారమవుతుందని భావించారు. దీంతో నవంబర్‌లోనే డిఎస్సీ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
సిలబస్‌లో మార్పు లేదు…
డిఎస్సీ 2024 సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. సిలబస్ వివరాలను https://aptet.apcfss.in అందుబాటులో ఉంచామని స్పష్టత ఇచ్చారు.
పోస్టుల వివరాలు…
తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.
స్కూల్ అసిస్టెంట్ – 7,725
ఎస్‌జీటీ – 6371
టీజీటీ – 1781
పీజీటీ – 286
పీఈటీ – 132
ప్రిన్సిపల్స్ – 52
టెట్ సెలక్షన్ లో తప్పులు
టెట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ (2ఏ) ఇంగ్లిష్‌ సబ్జెక్టులో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు అభ్యర్ధులు లబోదిబోమంటున్నారు. ఈ పేపర్ రెండో సెక్షన్‌లో మాతృ భాషగా తెలుగు సబ్జెక్టు రాయాల్సి ఉండగా, చాలామందికి ప్రశ్నాపత్రంలో ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ రావడం వివాదంగా మారింది. నిజానికి, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ ఎస్‌ఏ వారికి దరఖాస్తు సమయంలోనే మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఎస్‌ఏ ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు టెట్‌లో నాలుగు సెక్షన్లు ఉంటాయి. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ పెడగాజీ, మాతృభాష, జనరల్‌ ఆంగ్లం, సబ్జెక్టు కంటెంట్‌-మెథడాలజీ ఉంటాయి. రెండో సెక్షన్‌లో సాధారణంగా మాతృభాషగా తెలుగు సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంది. కానీ చాలా మంది మళ్లీ ఆ విభాగంలో తెలుగుకు బదులుగా మళ్లీ ఇంగ్లిష్‌నే ఎంపిక చేసుకున్నారు.ప్రభుత్వం ప్రకటించిన టెట్‌ ప్రకారం మాతృభాషను ఎంపిక చేసుకోవాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా కొందరు అభ్యర్థులు ఇంగ్లిష్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. కొందరు తెలుగు ఎంపిక చేసుకోవడం, మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా ఆంగ్లం ఎంపిక చేసుకోవడంతో మార్కుల్లో వ్యత్యాసం వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. టెట్‌ రాసే వారిలో తమిళ్, కన్నడ, ఒడియావారు కూడా ఉన్నారు. దీంతో మాతృభాషగా అన్ని సబ్జెక్టులూ వచ్చేలా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసే సమయంలో రెండో సెక్షన్‌ మాతృభాషకు సంబంధించి ఎవరికి వారు ఆయా భాషలను ఎంపిక చేసుకోవాలి. తెలుగు రాయాల్సిన వారు తెలుగుకు బదులు మళ్లీ ఆంగ్లాన్నే ఎంచుకోవడంతో సమస్య తలెత్తింది. నిజానికి, టెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకుప్పటికీ ఆంగ్ల సబ్జెక్టే వచ్చింది. దీనిపై అప్పట్లో అభ్యర్థులు ఫిర్యాదు చేస్తే సాఫ్ట్‌వేర్‌ సమస్య కారణంగా ఇలా జరిగిందనీ, పరీక్ష సమయంలో మార్పు చేస్తామని పేర్కొన్నారు. కానీ, తాజాగా జరిగిన ఆన్‌లైన్‌ పరీక్షలో మాత్రం అభ్యర్థుల మాతృభాషగా తెలుగుకు బదులు ఇంగ్లిష్‌ ఓపెన్‌ అయ్యింది. దీంతో అభ్యర్థులు తెలుగు పరీక్ష రాయలేదు.టెట్‌ నిబంధనల ప్రకారం నాలుగు విభాగాలకు కలిపి మొత్తం 150 మార్కులు ఉంటాయి. సబ్జెక్టు కంటెంట్‌-పెడగాజీకి 90మార్కులు మిగతా మూడు సెక్షన్లకు 30 మార్కుల చొప్పున ఉంటాయి. ఇప్పుడు మాతృభాష సబ్జెక్టు ఎంపికలో జరిగిన మార్పు కారణంగా 30 మార్కుల్లో తేడాలు వస్తే తమకు ర్యాంకులు మారిపోతాయని అభ్యర్థులు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *