దారి వెతుక్కుంటున్న రాజ్యసభ సభ్యులు

సిరా న్యూస్,విజయవాడ;
రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? టిడిపిలో చేరనున్నారా? మరికొందరు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారా? ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మరో నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇంకా రాష్ట్రంలో 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరితో రాజకీయం చేయాలని జగన్ చూస్తున్నారు. కానీ జగన్ తో ఉంటే తమ పరిస్థితి ఏంటి అని ఆందోళనతో వారు ఉన్నారు. అందుకే కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ముఖ్యంగా కూటమి రాజ్యసభ సభ్యులపై దృష్టి పెట్టింది. వారిని చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం ఆయన 25 రోజులపాటు లండన్ వెళ్ళనున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని టాక్ నడుస్తోంది. అందులో భాగంగా ఆరుగురు రాజ్యసభ సభ్యులు టిడిపిలోకి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయం జగన్ కు తెలుసు. వారిని నియంత్రించేందుకు ప్రయత్నించినా.. వారు పెద్దగా ఆసక్తి చూపనట్లు సమాచారం. అందుకే ఏం జరిగితే అది జరుగుతుంది అని జగన్ సైతం సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. అయితే టిడిపిలోకి ఎవరెవరు చేరుతారా అన్న చర్చ అయితే బలంగా నడుస్తోంది.వైసీపీకి రాజ్యసభ సభ్యులుగా వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి నమ్మకస్తులు ఉన్నారు. అటువంటి వారంతా జగన్ ను విడిచి పెట్టే అవకాశం లేదు. వారి మీద టిడిపి పెద్దగా దృష్టి పెట్టడం లేదు కూడా. అయితే ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాత్రం మోపిదేవి వెంకటరమణ. ఎన్నికల ముందు నుంచే ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల్లో ఆయన పేరును పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు జగన్. ఆయన ప్రత్యర్థికి టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. అందుకే ఆయన తప్పకుండా టిడిపిలో చేరతారని ప్రచారం సాగుతోంది.జగన్ మూలంగానే మోపిదేవి వెంకటరమణ సిబిఐ కేసుల్లో చిక్కుకున్నారు. ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అందుకే వైసీపీలో మోపిదేవి వెంకటరమణకు జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. ఏకంగా తన తొలి క్యాబినెట్లో ఛాన్స్ ఇచ్చారు. తరువాత రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ చేశారు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు ఆశించారు మోపిదేవి. కానీ రేపల్లెలో వేరే నేతకు టికెట్ ఇచ్చారు జగన్. అప్పటినుంచి మోపిదేవి వెంకటరమణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్ కోసం జైలుకు వెళితే తనకు పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు.అయితే మోపిదేవితో పాటు మరో ఐదుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు బిజెపిలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అయితే టిడిపిలో చేరే రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసి గెలవాలని టిడిపి భావిస్తోంది. తద్వారా వైసీపీని దెబ్బ కొట్టవొచ్చు అని చూస్తోంది. వైసీపీలో ఉన్న రాజ్యసభ సభ్యులు పెద్దగా కంఫర్ట్ గా లేరు. టిడిపి తో ఒప్పందం చేసుకొని వేరే పదవులు తీసుకోవడమో.. రాజ్యసభ సభ్యులుగా మరోసారి అవకాశం దక్కించుకోవడమో చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఒకరిద్దరు రాజ్యసభ సభ్యులే మిగులుతారని.. మిగతావారు వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని ప్రచారం సాగుతోంది. జగన్ విదేశాలకు వెళ్తున్న వేళ రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమని టాక్ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *