మెట్రో పనులు ప్రారంభం

 సిరా న్యూస్,హైదరాబాద్;
రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ పనుల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భాగ్య నగరం నలుమూలలకు మెట్రో సేవల్ని అందించేలా ప్రణాళికలు రూపొందించగా.. తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటి వరకు హైదరాబాద్ మహా నగరంలో కొన్ని ప్రాంతాలకే మెట్రో పరిమితమైన వేళ.. నూతన ప్రణాళికతో ఐదు నూతన కారిడార్లకు ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా రెండో దశ పనులకు రూ. 24,269 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించగా.. అందులో 30 శాతం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సమకూర్చాల్సి ఉంటుంది. అంటే.. రూ.7313 కోట్లు. కేంద్రం సైతం ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించనుండగా… కేంద్రం వాటాగా 18 శాతం అంటే రూ. 4,230 కోట్లు ఖర్చు చేయనుంది.ప్రాజెక్టులో మిగతా 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుకునేలా ప్రభుత్వం డీపీఆర్ రూపొందించింది. నగర శివారు ప్రాంతాల నుంచి రోజు లక్షల మంది నగరంలోకి ప్రవేశిస్తుంటారు. వారికి ప్రస్తుతం మెట్రో అనుకున్న మేర సేవలు అందిచలేకపోతోంది. ఈ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని.. నగరం నలుమూలలకు మెట్రో విస్తరణ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో ప్రణాళికలు రూపొందించింది.ఇప్పటి వరకు మూడు కారిడార్ల పనులు పూర్తవగా.. నాలుగో కారిడార్ గా నాగోల్ టూ శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో పరుగులు తీయనుంది. 35.8 కి.మీ మేరు చేపట్టనున్న నిర్మాణాలు.. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ జోరు మరింత పెంచే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. ఐదో కారిడార్ లో భాగంగా.. ఐటీ ప్రాంతాలైన రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపొలిస్ వరకు 11.6 కి.మీ మెట్రో నిర్మించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇక.. ఆరో కారిడార్లో ఆరో కారిడార్లో.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు 7.5 కి.మీ, ఏడో కారిడార్ మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు (13.4 .మీ), ఎనిమిదో కారిడార్ ఎల్‌బీనగర్ టూ హయత్ నగర్ వరకు 7.1 కి.మీ. మేర నూతన కారిడార్ అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్ కు సిటీ చుట్టు పక్కల నుంచి భారీగా రోజు వారీ కార్మికులు, ఉద్యోగాలు వస్తుంటారు. వారు నేరుగా గమ్య స్థానాలకు చేరుకునే వెసులుబాటు లేకపోవడంతో.. ఆటోలు, బస్సులో మెట్రో స్టేషన్ వరకు రావడం అక్కడి నుంచి మెట్రోలో ప్రయాణించాల్సి వచ్చేంది. మెట్రో దిగిన తర్వాత.. మళ్లీ ఆటోలు, బస్సుల్లో గమ్య స్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అందుకే.. నగరంలో అవసరమైన అన్ని మార్గాల్లో నూతన మెట్రోను పరుగులు తీయించాలని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఐదు నూతన కారిడార్ల డీపీఆర్ లను సిద్ధం చేసి.. పరిపాలన అనుమతులు ఇచ్చింది.
కేంద్రానికి ముడిపెట్టిన రేవంత్
హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న మెట్రో రెండో దశ పనులకు ముహూర్తం వచ్చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ పనులకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఇప్పుడు రెండో దశలో భాగంగా 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టనుంది. ఇందుకోసం ప్రభుత్వం జీవో 196ని జారీ చేసింది. రెండో విడత మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.7,313 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటికే నగరంలో కొత్తగా 5 మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు చేపట్టనున్నారు.కారిడార్ 4లో నాగోలు-శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గ-కోకాపేట వరకు 11.6 కిలోమీటర్లు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4కిలోమీటర్లు, కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కిలోమీటర్లు నిర్మించనున్నారు. మొత్తంగా రెండో దశలో 116.4 కిలోమీటర్లు ఈ రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. మొదటగా పార్ట్ ఏ కింద 76.4 కిలోమీటర్ల మార్గానికి పరిపాలన అనుమతులు మంజూరైనట్లు, పార్ట్ బిలో నిర్మించనున్న శంషాబాద్ విమనాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గానికి సర్వే జరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక హైదరాబాద్‌లో మెట్రో ఏర్పాటైనప్పటి నుంచి రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండో దశ కూడా అందుబాటులోకి వస్తే మరో 8 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.మెట్రో మొదటి దశ పూర్తయి చాలా కాలం కాగా.. ఇప్పటివరకూ రెండో దశ అడుగు ముందుకు పడలేదు. హైదరాబాద్ నగరంలో చాలా పరిమిత ప్రాంతాల వరకే మెట్రో విస్తరించి ఉంది. దీంతో ట్రాఫిక్ కొంత వరకు మాత్రమే తగ్గింది. ప్రజావసరాలను తీర్చేందుకు పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదు. అందుకే.. రేవంత్ సర్కార్ రెండో విడతకు శ్రీకారం చుట్టింది. దీంతో శివారు ప్రాంతాలకూ మెట్రో విస్తరించనుంది. దీంతో మహానగరానికి మరింత గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే.. రెండో విడత కోసం తెలంగాణ ప్రభుత్వం 30 శాతం నిధులు సమకూరుస్తోంది. 18 శాతం నిధులను కేంద్రం ఇస్తోంది. మిగిలిన నిధులను రుణాలు, పీపీపీ పద్ధతిలో సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండో దశ మీద ఎంతో కాలంగా ఆశలు పెట్టుకున్నప్పటికీ పరిపాలన అనుమతులు రాలేదు. కానీ.. తాజాగా ప్రభుత్వం అన్ని అనుమతులు జారీ చేసింది. ఎలాగూ కేంద్రం కూడా సహకరిస్తుండడంతో రెండో దశ పనులు వెంటనే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కేంద్రంతోనూ సఖ్యతగానే ఉంటుండడంతో.. కేంద్రం కూడా సహకరించేందుకు ముందుకు వస్తున్నది. మొత్తంగా రెండో దశ మెట్రో కూడా పనులు పూర్తయితే ఇటు ప్రయాణికులకు మరింత ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. అటు విశ్వనగరం ఖ్యాతి కూడా మరింత పెరగనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *