సిరా న్యూస్, ఆదిలాబాద్:
ప్రధాని మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి…
– జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి సీతక్క
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, బహిరంగ సభ కోసం ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని సభా వేదిక ప్రాంగణంతో పాటు ఎరోడ్రమ్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని పెన్ గంగ భవన్ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా ఇతర కేంద్ర మంత్రులు హాజరవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు రూ. 6 వేల కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారని ముందుగా సోమవారం ఉదయం 10 గంటలకు మోడీ ఆదిలాబాద్‌కు చేరుకుంటారని అన్నారు. కాగా పీఎం, సీఎం, కేంద్ర మంత్రుల హెలికాప్టర్ల ల్యాండింగ్ కోసం ప్రత్యేకంగా హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేయడంపై జిల్లా యంత్రాంగాన్ని ఆమె అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, మహబూబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేథన్, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.