సిరా న్యూస్, ఆదిలాబాద్
మీ ప్రాణాలను కాపాడుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడండి : మంత్రి సీతక్క
అత్యాధునిక పరికరాలను, డిడిఆర్ఎఫ్ బృందం ను ప్రారంభించిన మంత్రి
విపత్తు నిర్వహణ బృందం ఏర్పాటు: ఎస్పీ గౌష్ ఆలం
ఆపత్కాల సమయంలో ప్రాణ నష్టం జరగకుండా వెంటనే స్పందన
* జిల్లాలో 20 మంది సిబ్బందితో విపత్తు నిర్వహణ బృందం ఏర్పాటు
మీ ప్రాణాలను కాపాడుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా మావల పార్కులో జిల్లా విపత్తు నిర్వహణ బృందం డిడిఆర్ఎఫ్ (డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ను రాష్ట్ర పంచాయతీరాజ్ , రూరల్ డెవలప్మెంట్ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ డిడి ఆర్ఎఫ్ లో ఒక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సారథ్యంలో 20 మంది సిబ్బంది హైదరాబాద్‌లో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా వారం రోజులపాటు శిక్షణ తీసుకొని జిల్లాలో ఎలాంటి ఆపత్కాల సమయంలో విపత్తులు జరిగినప్పుడు అత్యవసరంగా స్పందించేందుకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ప్రత్యేక చొరవతో ప్రారంభమమైంది. జిల్లాలో వరదలు సంభవించినప్పుడు, ఇల్లు కూలిపోయినప్పుడు, ఎలాంటి తుఫానులు, సుడిగాలిలు సంభవించి రోడ్లు స్తంభించిపోయినప్పుడు చెట్లు పడ్డప్పుడు ఈ బృందం వెంటనే స్పందించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క డిడిఆర్ఎఫ్ బృందానికి సంబంధించినటువంటి రెస్క్యూబోట్, మోటర్ మిషన్స్, మెడికల్ స్ట్రక్చర్స్, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, వుడ్ కట్టర్ మిషన్స్ వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి ఆపత్కాల సమయంలోనైనా ప్రజలను త్వరగా కాపాడే విధంగా, ప్రాణ నష్టం వాటిల్లకుండా జిల్లాలో సొంతంగా డిడిఆర్ఎఫ్ (డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) పోలీసు సిబ్బంది ద్వారా ఏర్పాటు చేయడం సంతోషకరం అని పేర్కొన్నారు. జిల్లాలో డి డి ఆర్ ఎఫ్ నిర్వహిస్తున్న 20 మంది పోలీసు సిబ్బంది అందరికీ అభినందనలు తెలియజేశారు. ప్రమాదాల నుండి ప్రజలను కాపాడటమే మీ లక్ష్యంగా విధులను నిర్వర్తించాలని అదేవిధంగా మీ ప్రాణాలను కాపాడుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ, చాకచక్యంగా ఆలోచిస్తూ, బృందంలో ఒకరితో ఒకరు కలిసికట్టుగా విధులను నిర్వర్తిస్తూ విపత్తులలో శిక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ ద్వారా ఈ జిల్లా విపత్తు నిర్వహణ బృందం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. ప్రతి ఒక్క శాఖ లో ప్రతి అధికారి ఇలా ఆలోచిస్తూ ప్రజల సంరక్షణ కొరకు కృషి చేయాలని సూచించారు. ఇలాంటి నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ చేయూతనందిస్తూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. జిల్లా అభివృద్ధికి పూర్తిగా సాయశక్తుల కష్టపడుతూ తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అధికారులు ఆలోచించే విధంగా జిల్లా స్థాయి అధికారి జిల్లా ఎస్పీ ఆలోచించి జిల్లా ప్రజలు ఆపత్కాల సమయంలో స్పందించే విధంగా డిడిఆర్ఫ్ ఏర్పాటు చేయడం అభినందన నియమని పేర్కొన్నారు. ప్రాణనష్టం జరిగిన తర్వాత నష్టపరిహారం ఇవ్వడం కన్నా ప్రాణా నష్టం జరగకుండా కాపాడటం చాలా గొప్ప విషయమని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డిడిఆర్ఎఫ్ బృందం 20 మంది యువ పోలీసు సిబ్బంది ద్వారా ఏర్పాటు చేయబడినదని హైదరాబాద్‌లో వారం రోజులపాటు శిక్షణ తీసుకొని రానున్న వర్షాకాలంలో ఎటువంటి వరదలు విపత్తులు సంభవించిన ప్రాణ నష్టం జరగకుండా అత్యవసరంగా స్పందించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఖానాపూర్ శాసనసభ్యులు వేడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, పిఓ ఐటిడిఏ కుష్బూ గుప్త, డీఎఫ్ఒ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సిఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.