Minister Sridhar Babu: ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునరుద్ధరిస్తాం:  రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్ బాబు

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునరుద్ధరిస్తాం:  రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్ బాబు
* సీసీఐ సిమెంట్ ప‌రిశ్ర‌మ ప‌రిశీల‌న

మూతపడ్డ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెరిపిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం వరద తాకిడి ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన మంత్రి , ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ ఫ్యాక్టరీని సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న పరిశ్రమ యంత్రాలను, క్వార్టర్లను పరిశీలించి అక్కడున్న మేనేజర్, అధికారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీసీఐ పునరుద్ధరణ అంశంపై పలు మార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఇటీవల కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామిని కూడా కలిసి సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ పై చర్చించినట్టు తెలిపారు. కేంద్రం సానుకూలంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందించి పరిశ్రమ పునరుద్ధరణతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సీసీఐ తెరిపించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అక్కడి అధికారులకు మంత్రి సూచించారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ పని తీరుపై ప్రశంస..
ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ అయినా స్థానిక సమస్యల విషయంలో సిమెంట్ పరిశ్రమ విషయంలో గట్టి సంకల్పంతో పని చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావుండవద్దని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం జైనథ్ మండలంలో వరద తాకిడి ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. కామాయి గ్రామంలో నీట‌ మునిగిన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాల్లో వరద పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ గౌస్ అలం, సీసీఐ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *