సిరా న్యూస్, జైనథ్:
కార్యకర్తలు లేకపోతే నేను లేను…
–ఆత్మీయ సన్మాన సభలో ఎమ్మెల్యే పాయల్ శంకర్
+ పాయల్‌కు ఘన స్వాగతం పలికిన అడ గ్రామ ప్రజలు
+ పాయల్ దంపతులకు పెద్ద ఎత్తున సన్మానం
+ తన తండ్రి గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్న పాయల్ శరత్
గత 20ఏండ్లు తనతో ఉన్న కార్యకర్తలు, గ్రామస్తుల సహాకారంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని, కార్యకర్తలు లేకపోతే తాను లేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం తన స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం అడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన తన సతీమణీతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, నృత్యాలు, మంగళ హారతులతో గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మొదటి సారిగా స్వగ్రామానికి రావడంతో మొదటగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘనంగా ఆత్మీయ సన్మానం…
గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే పాయల్ శంకర్ దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ… తాను మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన కూడ తన కార్యకర్తలు ఎవరూ తనని వదిలివెళ్లలేదన్నారు. బీఆర్‌ఎస్ హాయంలో తప్పుడు కేసులు బనాయించిన కూడ బెదరకుండా తన వెంట నడిచారని అన్నారు. అడ గ్రామస్తులు సైతం ఎన్నో కష్టాలు పడ్డారని, గత పాలకులు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అడ, ముక్తాపూర్ గ్రామాలకు అందకుండా చేశారాని అన్నారు. గ్రామస్తులు, కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు. కాగా తాను కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా 20ఏండ్లుగా రాజకీయాల్లో తిరుగుతుంటే, తన సతీమణీ ఎంతగానో అండగా నిలిచిందని, ఆమె ప్రొత్సాహం సైతం మరువలేనిదని ఆయన అన్నారు.
భావోధ్వేగానికి గురైన పాయల్ శరత్…
సన్మాన కార్యక్రమం తరువాత మాట్లాడిన ఎమ్మెల్యే కుమారుడు పాయల్ శరత్ భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రిని ఎమ్మెల్యేగా చూడాలని కార్యకర్తలు, గ్రామస్తులతో పాటు తాను కూడ ఏండ్లుగా ఎదురుచూసానని అన్నారు. తన చిన్నతనం నుంచే తన తండ్రి ప్రజాసేవకు అంకితమై తిరుగుతుంటే. తన తల్లి దగ్గరుండి అన్ని చూసుకున్నదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన తల్లికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి గెలుపులో భాగస్వాములైన ప్రతీ ఒక్కరి ఆయన ధన్యవాదాలు తెలిపారు.