సిరా న్యూస్, ఆదిలాబాద్(రూరల్):
అనుకుంట ఆలయంతో అవినాభావ సంబంధం…
– ఎమ్మెల్యే పాయల శంకర్
ఆదిలాబాద్ రూరల్ మండలం అనుకుంట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో తనకు అవినాభావ సంబంధం ఉందని, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం ఆలయంలో నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేలాది భక్తులు తన్మయత్వంతో చూస్తుండగా, వేదమంత్రాలు, భాజ భజంత్రీల నడుమ శ్రీ పద్మావతి అలివేలు మంగమ్మ, వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ… తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తన బాల్యంలో ఎడ్ల బండి పై తమ స్వగ్రామమైన కంఠ నుండి అనుకుంట వెంకటేశ్వర స్వామి జాతరకు వచ్చే వారమని గుర్తు చేసుకున్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి తన వంతుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకుంట, బంగారుగూడ ప్రజలు తనకు సంపూర్ణ మద్దతు తెలిపారని, వారికి సర్వదా రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బిజెపి నాయకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.