సిరా న్యూస్, ముథోల్:
పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే రామారావ్ పటేల్
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పలు పంటలను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ పరిశీలించారు. బుధవారం ఈ మేరకు ఆయన మండలంలోని కోలూరు, మొగిలి, మసల్గా, ఎల్వి గ్రామాల్లో పర్యటించారు. రైతులతో మాట్లాడి, పంట నష్టం గురించి అడిగి తెల్సుకున్నారు. అనంతరం పలు పంట క్షేత్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాలకు జొన్న, మొక్క జొన్న పంటలు పూర్తిగా నేలకొరిగాయని, పొగాకు పంటలో ఆకులు రాలిపోయాయని, శనగ, ధనియా, పుచ్చకాయ పంటలు సైతం చాలా వరకు దెబ్బతిన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయనతో మాట్లాడి, తమ గోసను వెల్లగక్కుకున్నారు. ఎకరానికి రూ. 30వేల నుండి రూ. లక్ష వరకు ఖర్చు చేసి పండించిన పంటలు, చేతికొచ్చే సమయానికి దెబ్బితిన్నాయని వాపోయారు. కాగా రైతులు ఎవరూ కూడ బాధపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నుండి రైతులందరికి నష్ట పరిహారం ఇప్పించేందుకు కృషీ చేస్తానని ఎమ్మెల్యే రైతులకు భరోసా కల్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్‌ను కలిసి పంట నష్టం గురించి వివరించడం జర్గిందన్నారు. ప్రభుత్వం తరపున రైతులను ఆదుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీఏ వీణ, బీజేపీ నాయకులు శివాజీ పటేల్, చక్రధర్ పటేల్, చిన్నారెడ్డి, లక్ష్మారెడ్డి, రైతులు పాల్గొన్నారు.