సిరా న్యూస్, ఓదెల
మానేరుపై హైలేవల్ వంతెన నిర్మాణానికి నిధులు విడుదల: ఎమ్మెల్యే విజయరమణ రావు
* పెద్దపల్లి, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు హర్షం
మానేరుపై మరో వంతెన నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరనున్నది. ఓదెల మండలం రూప్నారాయణపేట వద్ద మానేరుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం 80కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆర్టీ నంబర్ 801 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని ఎమ్మెల్యే విజయరమణ రావు తెలిపారు. దీంతో 15 కిలోమీటర్ల దూర భారం తగ్గుతుందని, ఇప్పటి వరకు మానేరు నదిపై ఐదు వంతెనలు ఉండగా, ఈ వంతెన ఆరవది. జిల్లాలోని ఓదెల మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉండగా, రూప్నారాయణ పేట వద్ద నిర్మించనున్న వంతెన 18 గ్రామాల ప్రజలకు ప్రయోజనకరంగా మారనుందని తెలిపారు. అలాగే పెద్దపల్లి నుంచి జమ్మికుంటకు వెళ్లేందుకు పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్ తదితర ప్రాంతాల ప్రజలకు దూర భారం తప్పందని తెలిపారు. ఓదెల మండల వాసులు ప్రస్తుతం జమ్మికుంటకు వెళ్లేందుకు పొత్కపల్లి, షానగొండ, ఇందుర్తి, బాయమ్మపల్లి, గుంపుల మీదుగా మానేరు వంతెన మీదుగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల, గండ్రపల్లి, నాగంపేట్ మీదుగా జమ్మికుంటకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే విజయరమణ రావు పార్టీ అధికారంలోకి రావడంతో ఐదు మాసాల నుంచి వంతెన నిర్మాణానికి నిధుల మంజూరు కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. వారిపై ఒత్తిడి తీసుకు వచ్చారు. అది ఫలించి వంతెన నిర్మాణానికి 80 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో ఓదెల మండల ప్రజలే గాకుండా పెద్దపల్లి, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.