సిరా న్యూస్, ఆదిలాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే తాంసి రైల్వే బ్రిడ్జి పనులకు బ్రేక్…
– ఎమ్మేల్యే పాయల్ శంకర్
+ అధికారులతో కలిసి బ్రిడ్జి పనులు పరిశీలన
+ పనులు వేగవంతం చేయాలని ఆదేశం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్ద కొనసాగుతున్న రైల్వే బ్రిడ్జి పనులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే నిలిచిపోయాయని ఆదిలాబాద్ ఎమ్మల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గురువారం ఆయన రైల్వే, ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులతో కలిసి తాంసి బస్టాండ్, పరిసర ప్రాంతాలను సందర్శించారు. స్థానిక ప్రజలతో కలిసి వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆదిలాబాద్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జి పనులు 2018లోనే పూర్తి కావాల్సి ఉందన్నారు. కేంద్రం నుంచి నిధులు విడుదల అయిన కూడా, రాష్ట్రప్రభుత్వం అలసత్వం కారణంగానే పనులు నిలిచిపోయాయని ఆయన అన్నారు. దీంతో ప్రస్తుతం నిర్మాణ వ్యయం పెరిగి, పనులు ముందుకు సాగే పరిస్థితి లేదన్నారు. దీంతో పాటు బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు సైతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడంతోనే తాంసి బస్టాండ్ వద్ద పనులు ఆగిపోయాయి అన్నారు. ఈ బ్రిడ్జి తో పాటు తాటి గూడ, మహాలక్ష్మి వాడ భాగ్యనగర్ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ కు వచ్చే ప్రజల కోసం ఫూట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆయన అన్నారు. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే దాదాపు 25% ట్రాఫిక్ తగ్గుతుందని అన్నారు. ఇప్పటికే రైల్వే క్రాసింగ్ వద్ద దాదాపు అరగంట వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని, పిట్లైన్ పనులు ప్రారంభమైతే ప్రతిరోజూ ఆదిలాబాద్ నుండి 25-30 రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు ప్రారంభం అవుతాయని, దీంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుందని అన్నారు. దీనికి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామని అన్నారు. అదిలాబాద్ లో దాదాపు 50 శాతం మంది జనాభా రైల్వే లైనుకు అవతలి వైపున ఉన్నందున యుద్ద ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.