సిరాన్యూస్, ఇచ్చోడ
దర్జాగా .. అక్రమ మొరం దందా
* జోరుగా మట్టి.. మొరం తవ్వకాలు
*అందినకాడికి దండుకుంటున్న అక్రమార్కులు
* ప్రభుత్వ స్థలాలు, అటవీ భూముల్లోనే తవ్వకాలు
* పట్టించుకోని సంబంధిత అధికారులు
పచ్చదనంతో కళకళలాడాల్సిన గుట్టలు కనుమరుగై పోతున్నాయి. గుట్ట పక్కన ప్రభుత్వ భూముల నుండి మొరం మాఫియా దర్జాగా గుట్టలను తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యధేచ్చగా మొరం తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ సంపద కొల్లగొడుతున్నారు. అక్రమ దందాలు అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇచ్చోడ మండలంలో గుట్టల చుట్టూ ఇష్టారాజ్యంగా ప్రజా ప్రతినిధుల అండదండలతో జెసిబితో మొరం తోడేస్తున్నారు. ట్రాక్టర్లతో మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గుట్ట నుండి చెరువు నుండి ప్రభుత్వ భూమి నుండి మొరం తరలించాలంటే తప్పనిసరిగా రెవెన్యూ శాఖ నుండి మైనింగ్ శాఖ అధికారుల నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్రమార్కులు అవేమి పట్టించుకోకుండా ప్రభుత్వ అనుమతులను బేకార్ చేస్తూ భవన నిర్మాణాలకు జెసిబితో అక్రమంగా మొరం మట్టిని తోడేస్తు కొందరు అక్రమార్కులు గుట్టల ఆనవాలు లేకుండా చేస్తున్నారు. ఇంత జరిగిన అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మొరం తవ్వకాలతో ప్రభుత్వానికి గండి పడుతున్న రెవిన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మండలంలో మొరం తవ్వకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు.