మరింత దూకుడు…

హైడ్రా భారీ యంత్రాలకు కొనుగోళ్లు
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేతను మరింత వేగవంతం చేస్తోంది. హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలపై HMDAకు హైడ్రా కమిషనర్ లేఖ రాసింది. ఎఫ్‌టీఎల్‌ లేదా బఫర్‌లో నిర్మాణాలకు పర్మిషన్ రద్దుచేయాలని లేఖలో కోరారు. అనుమతులను మరోసారి రీ వెరిఫై చేయాలని సూచించారు. కోమటికుంటతో పాటు 5 చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్‌ రద్దు చేయాలని కోరారు.మరోవైపు ఆక్రమణల కూల్చివేతల అంశంలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఏకకాలంలో కూకట్‌పల్లిలో, అమీన్‌పూర్‌ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలోని నాలుగు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది.ఇదిలా ఉండగా, చెరువులు, నాలాల ఆక్రమణలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రత్యామ్నాయం చూపాలన్నారు. ఔటర్‌ లోపలి చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
భారీ యంత్రాల కొనుగోళ్లు…
చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పడ్డ హైడ్రా.. అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తోంది. చెరువులను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కాగా కూల్చివేతలు, శిథిలాల తొలగింపు, కూల్చివేతలకు అవసరమైన అత్యాధునిక మరియు భారీ యంత్రాలను సమకూర్చునే దిశగా హైడ్రా కార్యచరణ చేపట్టింది. కాంట్రాక్ట్ పద్ధతిలో కూల్చివేతలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానిస్తోంది. ఈ నెల 27న యంత్రాల కోసం బిడ్డింగ్ ఆహ్వానించింది. ఆఫ్ లైన్ లో టెండర్లను ఆహ్వానించిన హైడ్రా.. తమ ప్రతిపాదనలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని సూచించింది. ఏడాది కాల పరిమితితో బిడ్స్ ను స్వీకరిస్తోంది. సంస్థలు తమ నియమ, నిబంధనలను పాటించాలని షరతులు విధించింది హైడ్రా.బిడ్డర్లు తప్పనిసరిగా యంత్రాలను కలిగి ఉండాలని హైడ్రా సూచించింది. 20 మీటర్ల ఎత్తులో ఉన్న ఏ నిర్మాణం అయినా.. కూల్చే విధంగా హైరీజ్ హైడ్రాలిక్ యంత్రాలు ఉండాలంది. జా క్రషర్, షీట్ కట్టర్, అడిషనల్ షీర్ కట్టర్, రాక్ బ్రేకర్, రెండు ఎక్సవేటర్లు, రెండు జేసీబీలు, రెండు మినీ ఎక్సవేటర్లు, రెండు రాక్ బేకర్లు కలిగుండాలంది హైడ్రా.ఇక, జూన్ 26 నుంచి కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రా.. ఇప్పటివరకు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను కూల్చేసింది. ఇప్పటివరకు ఆక్రమణకు గురైన 120 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించింది హైడ్రా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *