సిరా న్యూస్, జైనథ్:
కాంగ్రెస్ గూటికి ముడుపు ప్రశాంత్ రెడ్డి
– కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరిక
బిఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం యువజన విభాగం అధ్యక్షులు ముడుపు ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏళ్లుగా బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగంలో చురుకుగా ఉంటూ, మంచి యువ నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి జోగు రామన్న ఎమ్మెల్యేగా ఓడిపోగా, చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ లో చేరారు. కానీ ప్రశాంత్ రెడ్డి మాత్రం తాను బిఆర్ఎస్ ను వీడేది లేదని, జోగు రామన్న ఓటమి తర్వాత కూడా ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని బిఆర్ఎస్ లోనే ఉండిపోయారు. ప్రస్తుతం అకస్మాత్తుగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై “సిరా న్యూస్” ప్రశాంత్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడగా… కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని, గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని ఆయన అన్నారు.