సిరా న్యూస్,కర్నూలు;
అవడానికి పిల్లలే అయినా వారి మనసుల్లో పేరుకుపోతున్న వికృతాల కారణంగా సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలో నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది . ఎనిమిదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేసి మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశారు. ఈ ఘటన పెను సంచలనం రేపుతోంది.నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడిరాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన వాసంతి అందరి పిల్లలతో పాటు ఆదివారం గ్రామ వీధుల్లో ఆడుకుంటూ ఉంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు వాసంతికి ఆడుకుందామని మాయ మాటలు చెప్పి జనావాసం లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ చిన్నారిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. వారి అఘాయిత్యాన్ని భరించలేక ఆ పాప కన్నుమూసింది. వాసంతి చనిపోవడంతో ముగ్గురు బాలురు భయపడి పక్కనే ఉన్న కృష్ణ నదిలోకి ఆ చిన్నారి మృతదేహాన్ని పడేశారు. ఏమి తెలియనట్లుగా ఇంటికెళ్లిపోయారు. అప్పటి వరకూ ఆడుకుంటున్న పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పిల్లలతో ఆడుకుంటూ ఎటో వెళ్లి ఉంటుంది లే తిరిగి వస్తుందని నిర్లక్ష్యం చేశారు. అయితే రోజు గడిచిపోయినా రాకపోవడం.. పోలీసులు పట్టించుకోకపోవడంతో పాప తల్లిదండ్రులు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని ఆశ్రయించారు. ఎంపీ శబరి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి.. హుటాహుటిన వాసంతి మిస్సింగ్ కేసును నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం నాడు చిన్నారి ఎక్కడెక్కడ కు వెళ్లింది అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్‌తో పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ పాపపై అఘాయిత్యానికి పాల్పడిన ప్రాంతాన్ని గుర్తించింది. అక్కడ ఉన్న ఆధారాలను పోలీసులు సేకరించి విచారణ చేయడంలో సంచలన విషాయలు వెలుగులోకి వచ్చాయి. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పోలీసులు విచారణ జరిపి ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు విస్తు పోయే నిజాలు చెప్పారు. ఆదివారం గ్రామ వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆ యువకులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. చనిపోవడంతో ఏం చేయాలో తెలియక కృష్ణ నదిలో పడేశామని వారు చెప్పడంతో మృతదేహం కోసం కృష్ణా నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభ్యం అవలేదు. ఈ ఘటన కర్నూలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.