– పుట్టలో పాలు పోసి తమ భక్తిని చాటుకున్న మహిళలు
సిరా న్యూస్,మంథని;
నాగుల పంచమి వేడుకలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో మంథని పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. మంథని మున్సిపల్ పరిధిలోని బోయినిపేటలోని శ్రీ నాగులమ్మ ఆలయం తో పాటు, పట్టణంలోని పెంజేరుకట్ట వీధిలోని పురాతన శ్రీనాగమయ్య పుట్ట వద్ద భక్తులు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇతర దేవాలయాలను సైతం దర్శించుకున్నారు. గాజులపల్లిలోని శ్రీ సంతాన నాగేంద్రస్వామి ఆలయంతో పాటు పలు గ్రామాల్లోని పుట్టల వద్ద పూలు, పండ్లతో భక్తులు పూజలు నిర్వహించారు. సంతాన నాగేంద్రస్వామిగా మంథని ప్రాంతంలో పేరుగాంచిన శ్రీ సంతానం నాగేంద్ర స్వామి ఆలయంలో గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల నుంచి పెద్దఎత్తున వచ్చిన భక్తులు, పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు తరలిరావడంతో ఆలయ ఆవరణ సందడిగా మారింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహించారు. మంథని బోయినిపేటలోని శ్రీ నాగులమ్మ ఆలయంలో మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.