సిరా న్యూస్,విజయవాడ;
అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. హిందూ ధార్మిక సంఘాల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. ఏపీలో రాజకీయంగా అట్టుడుకుతోంది. టీడీపీ, వైసీపీ నేతలు ఈపాపం మీదంటే మీదేనంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ అడుగు మందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేశారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలో వైసీపీ నేతలపైనా, సినీ ప్రముఖులపైనా విమర్శలు గుప్పించారు.నెయ్యి కల్తీపై వైసీపీ నాయకులను తీవ్రంగా విమర్శించన పవన్ కల్యాణ్.. అనంతరం పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రకాశ్‌రాజ్‌తో పాటు, సినిమా యాక్టర్లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఈ ఇష్యూలో మొదట పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కి ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ప్రియమైన పవన్ కల్యాణ్, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది. నిందితులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోండి. అంతేకానీ, లేనిపోని భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారు. ఇప్పటికే దేశంలో మతపరమైన ఆందోళనలు ఉన్నాయి అంటూ రెండు రోజుల క్రితం ట్వీట్ చేశారు. ఈ ఎక్స్ వార్‌లో వెంటనే మంచు విష్ణు ఎంటరయ్యారు. పవన్‌కి సపోర్ట్ చేస్తూనే.. ప్రకాశ్ రాజ్‌కి మీ పరిధిలో మీరు ఉండాలంటూ సున్నితంగా వార్న్ చేశారు. మరోవైపు తిరుమల లడ్డూ విషయంలో దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతునే వచ్చింది.ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ దుర్గ గుడి మెట్లు కడిగిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఒకరిద్దరికి కాదు… ప్రకాశ్ రాజ్, సినీ హీరో కార్తీ, సోమవారం ఢిల్లీలో మాట్లాడిన పొన్నవోలు.. ఇలా అందరికీ వరుస పెట్టి వాయించేశారు. తాను హిందువుల విషయం గురించి మాట్లాడితే ప్రకాష్‌రాజ్ అభ్యంతరం ఏమిటని, ఏ మతాన్ని తాను నిందించలేదని, దీనిని కూడా తాను గోల చేస్తున్నానని అనడం ఏమిటని ప్రశ్నించారు. ముస్లింలు, మదర్సాల మీద తనకు ఎప్పడూ గౌరవం ఉందని, వాటికి లక్షల కొద్ది విరాళాలు ఇచ్చానని గుర్తు చేశారు. మిషనరీ స్కూల్లోనే చదువుకున్నానని, వారి మీద తనకు ఎప్పుడు గౌరవం ఉంటుందన్నారు. తనను తాను తగ్గించకున్న వాడు హెచ్చింపబడతారనే దానిని నమ్ముతానని, అయితే నేను పాటించే ధర్మానికి అన్యాయం జరిగితే తాను మాట్లాడటంలో తప్పేమిటన్నారు. ప్రకాష్ రాజ్ ఇవి తెలుసుకోవాలన్నారు.అయితే పవన్ రియాక్షన్‌పై తాజాగా రియాక్టయ్యారు ప్రకాశ్ రాజ్. తన వ్యాఖ్యలను పవన్ అపార్థం చేసుకున్నారని ఎక్స్ ప్లాట్ ఫాం వేదికగా వివరించారు. తాను ఒకటి చెబితే పవన్ మరోలా అర్థం చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నానని, ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి అన్నింటికీ సమాధానం చెబుతానని అన్నారు. వీలైతే తన ట్వీట్‌ని మరోసారి చదివి అర్థం చేసుకోవాలని కోరారు.మరోవైపు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పవన్‌కల్యాణ్. హీరో కార్తీ సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది. వేడుకలో యాంకర్ కార్తీతో మాట్లాడుతూ.. లడ్డూ కావాలా నాయనా అని అడిగారు. అందుకు కార్తీ స్పందిస్తూ.. లడ్డూ టాపిక్ వద్దని.. ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్ అని కామెంట్ చేశారు. లడ్డూ గురించి హీరో కార్తీ సెటైర్లు వేశారు. కార్తీ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. సినిమా ఫంక్షన్లలో హిందూ ధర్మాన్ని కించపర్చొద్దని సూచించారు. సనాతన ధర్మ పరిరక్షణలో సినిమావాళ్లకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలపై జోకులు వేయడం మానుకోవాలని అన్నారు. అభిమానులు కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.పవన్ వ్యాఖ్యల తర్వాత సినీ హీరో కార్తి వివరణ ఇచ్చారు. పవన్ కల్యాణ్ అంటే నాకు అమితమైన గౌరవం ఉందన్నారు. అనుకోని అపార్థానికి క్షమాపణలు కోరుతున్నా అన్నారాయన. తిరుమల శ్రీవారి భక్తుడిగా సంప్రదాయాలకు కట్టుబడి ఉంటానని హీరో కార్తి చెప్పారు.అయితే మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడిగా, విధేయుడిగా ముద్రపడ్డ ప్రకాశ్‌రాజ్‌పై ఈ రేంజ్‌లో పవన్ కల్యాణ్ ఫైర్ కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమా రిలేషన్స్ వేరు.. రాజకీయాలు వేరు అని పవన్ నిరూపించదల్చుకున్నారా అనే టాక్ వినిపిస్తోంది. సినిమా, రాజకీయాలన్నింటికన్నా సనాతన ధర్మం గొప్పదని హిందూ సమాజంలో తనదైన ముద్రను వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారా అనే చర్చ మొదలైంది.