అడ్డంగా బుక్కైన నందిగం..

 సిరా న్యూస్,గుంటూరు;
ప్రకాశం బ్యారేజ్‌కు కొట్టు కొచ్చి గేట్లను డ్యామేజ్ చేసిన బోట్లపై.. ఏపీ ప్రభుత్వం సీరియస్ అయి విచారణకు ఆదేశించింది. వరద ప్రవాహంలో ఒకేసారి లంగర్లు వేసిఉన్న నాలుగు పడవలు కొట్టుకురావడంపై మొదట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం దానిపై సీరియస్ అయ్యారు. తాజాగా ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు విచారణ ప్రారంభించారు. అవి ఫెర్రీ ఘాట్ వద్ద ఇసుక రవాణాకు వైసీపీ నేతలు వినియోగించిన బోట్లే అంటున్నారు. ఆ క్రమంలో బోట్లు ఉచ్చు మాజీ ఎంపీ నందిగం మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది.కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఇనుప బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజీ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్‌ వెయిట్లు దెబ్బతిన్నాయి. 64వ నంబరు గేటు వద్ద ఉండే వెయిట్‌ స్వల్పంగా దెబ్బతినగా.. 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్‌ సిమెంట్‌ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. ఈనెల 2న కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది.అప్పుడు కొట్టు కొచ్చిన బోట్లలో ఒకటి 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోటును ఢీ కొని మరో రెండు బోట్లు ఆగిపోయాయి. మరో బోటు 64వ నంబరు ఖానా వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. ఈ బోటూ అక్కడ ఇరుక్కుపోయింది. ఒకేసారి నాలుగు బోట్లు కొట్టుకురావడంపై మొదట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు.తాజాగా ఆ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ.. ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో.. విజయవాడ వన్ టౌన్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బోట్ల ఓనర్లని ప్రశ్నించబోతున్నారు. వేసిన లంగర్లు తెంపుకుని పడవలు ఎలా కొట్టుకుని వచ్చి గేట్లను ఢీకొన్నాయనే అంశంపై వివరాలు అడగనున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీ ఘాట్ నుంచే ఈ బోట్లు కొట్టుకుని వచ్చి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆ బోట్లు వైసీపీకి చెందిన వారివే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా కోసం ఆ పడవలు వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని.. దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కొల్లు రవ్రీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన బోట్లు వైసీపీ నాయకులకు చెందినవిగా అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీ కొన్నట్లు సమాచారం ఉందన్నారు… ప్రకాశం బ్యారేజిని డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగానే ఒకే చోట ఢీకొనే విధంగా చేశారని మండిపడ్డారు.ఇసుక తోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. బ్యారేజీని ఢీ కొట్టిన పడవలకు ఎటువంటి అనుమతులు కూడా లేవని తెలుస్తుందని వాటికి వైసీపీ రంగులే ఉన్నాయని బ్యారేజీకి జరగరాని డామేజ్ జరిగి ఉంటే పెద్ద ఉపద్రవం వచ్చేదని దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని వ్యాఖ్యానించారు.మరోవైపు విజయవాడను ముంచెత్తిన బుడమేరు వాగు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు . ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు.. తాజాగా మూడో గండిని పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేశ్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి.బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను పర్యవేక్షిస్తూ ఆరు రోజులుగా నిద్రాహారాలు మాని బుడమేరు గట్టుపైనే ఉన్న రామానాయుడు. అక్కడ పని పూర్తవ్వగానే ప్రకాశం బ్యారేజ్‌ గేట్లకు జరుగుతున్న రిపేర్లను ఆయన పర్యవేక్షించారు. అదలా ఉంటే ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీ కొట్టిన పడవుల యజమానుల ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెం కు చెందిన కోమటి రామ్మోహన్ పడవులు గా గుర్తింపు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే ఈ పడవులు నడిచినట్లు పోలీసులు గుర్తించారు.ప్రస్తుతం నందిగామ సురేష్ ఆధ్వర్యంలో మీ పడవలు నడుస్తున్నయా లేదా అనేది పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.. కుట్ర కోణం వెలికి తీసేందుకు విచారణను పోలీసులు వేగవంతం చేస్తున్నారు .. దర్యాప్తు పురోగతిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మొత్తానికి బోట్లను ఢీ కొట్టిన వ్యవహారాన్ని ప్రభుత్వం సీనియస్‌గా తీసుకోవడంతో అటు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో పాటు మరింత మంది వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *