తెలంగాణకు కొత్త రైల్వే లైన్

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో కొత్త రైల్వే లైను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఒడిసాలోని మల్కన్ గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు ఈ రైల్వే లైను నిర్మాణం కొనసాగుతుంది. మొత్తం 290 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒడిసా, తెలంగాణ, ఏపీ, జార్కండ్, చత్తీస్ గడ్ ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ, సరకు రవాణాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రాజెక్టుగా ఇది రూపుదాల్చనుంది. రూ.7383 కోట్లతో ఈ లైను నిర్మించేందకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు కూడా దీనివల్ల అత్యధిక ప్రాధాన్యం దక్కబోతోంది. 34 వంతెనలు వస్తాయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు అనుసంధానం చేయడంతోపాటు మహానది కోల్డ్ ఫీల్డ్ నుంచి దక్షిణ భారతదేశంలోని విద్యుత్తు తయారీ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను వేగంగా చేయడానికి మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా ఇనుప ఖనిజం, అల్యూమినియం పరిశ్రమలకు కూడా ఈ ప్రాజెక్టువల్ల భారీ లబ్ధి చేకూరనుంది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సులభతరం అవుతుంది. ఈ మార్గంలో మొత్తం 34 పెద్ద వంతెనలతోపాటు 264 చిన్న వంతెనలు, 41 ఆర్వోబీలు, 76 ఆర్ యూబీలు నిర్మిస్తారు. భద్రాచలం వల్ల భారీ వంతెన నిర్మాణంలోకి వస్తుంది. ఖాజీపేట-విజయవాడ ప్రధాన మార్గానికి ఇది బ్రాంచ్ లైన్ అని చెప్పొచ్చు. తీర ప్రాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం తీర ప్రాంతంలో చెన్నై, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ మీదగా కోల్ కతా వరకు రైల్వే లైను ఉంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ వరంగల్ – భద్రాచలం – మల్కన్ గిరి – జయపూర్ – టిట్లాగఢ్ మార్గం ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీనివల్ల బస్తర్ నుంచి దక్షిణ భారతదేశానికి 124 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రాజమండ్రి, విశాఖపట్నం వంటి రద్దీ మార్గాలను దాటవేయడానికి అనువుగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల కోటి పనిదినాల ఉపాధి కార్మికులకు లభించబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *