కోటు వద్దు .. ఖద్దరు ముద్దు

సిరా న్యూస్,విజయవాడ;
ఇటీవలి వరకు సెక్రటేరియట్‌లో ఫైళ్లతో కుస్తీ పడుతుండేవారు. కోటు, సూటు, బూటు.. వ్యవహారం అంతా అఫీషియల్ గా కనిపించేది. కానీ ఇప్పుడు వీధుల్లో తిరుగుతూ.. ప్రజలతో కలిసిపోయి తమకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఇలా ఒకరో, ఇద్దరో అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. కొందరు ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. మరి కొందరికీ పదవులు చేపట్టిన అనుభవం ఉంది. చాలా మంది ఫస్ట్ టైం బరిలో నిలుస్తున్నారు. వారందరిపై ఓ లుక్ వేద్దామా..ప్రస్తుత ఏపీ ఎన్నికల సమరంలో ఎక్కువగా ఆకర్షిస్తున్న ఐఎఎస్ లు ఇద్దరు. వారు ఏఎండీ ఇంతియాజ్, జీఎస్ఆర్‌కేఆర్ విజయ్ కుమార్. ఇద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులే. ఇద్దరూ ప్రస్తుత ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యారు. వీరిలో ఇంతియాజ్ ఇటీవలే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించారు. మరో ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ రిటైర్మెంట్ తరువాత కూడా కీలక పదవిలో కొనసాగినప్పటికీ గత ఏడాది జులైలో ఆ పదవికి రాజీనామా చేసి ఎన్నికల రాజకీయాలలోకి అడుగుపెట్టారు. వీరే కాకుండా ఏపీ ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పలువురు మాజీ ఉన్నతాధికారులు పోటీపడుతున్నారు.ప్రధానంగా మాజీ అధికారులు శాసన వ్యవస్థపై గురి పెడుతున్నారు. కర్నూలు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఇంతియాజ్ ఏపీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు కమిషనర్ గా పనిచేస్తూ వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నారు. వెంటనే రాజకీయరంగంలోకి అడుగిడారు. మైనారిటీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా, సెర్ప్ సీఈఓగా, కృష్ణా జిల్లా కలెక్టరుగా… ఇలా ఏపీ ప్రభుత్వంలో అనేక ఇతర హోదాలలోనూ పనిచేశారు. ఇంతియాజ్ గ్రూప్ -1 ద్వారా కమర్షియల్ టాక్స్ అధికారిగా పనిచేస్తూ 2009లో ఐఏఎస్ హోదా పొందారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి ముందు తమ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. కర్నూలు జిల్లాలో రెండు రూపాయల డాక్టరుగా పాపులర్ అయిన కేఎం ఇస్మాయిల్‌కు ఇంతియాజ్ అల్లుడు. కర్నూలు సిటింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు ఈసారి టికెట్ ఇవ్వకుండా కొత్తగా వైసీపీలో చేరిన ఇంతియాజ్‌కు జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు.ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్‌కేఆర్ విజయ్ కుమార్ 2023 జులై 22న ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అంతకుముందే రిటైరైన ఆయన్ను జగన్ ప్రభుత్వం ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా నియమించింది. దళిత వర్గానికి చెందిన విజయ్ కుమార్‌కు ప్రకాశం సహా వివిధ జిల్లాలలో కలెక్టర్‌గా, అనంతపురం జిల్లాలో సబ్ కలెక్టరుగా పనిచేసిన అనుభవం ఉంది. అనంతపురం జిల్లాలో ఆయన సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ ఎన్నికలలో పరిటాల రవి ఎన్నికల అక్రమాలకు పాల్పడితే సమర్థంగా అడ్డుకున్నానని విజయ్ కుమార్ గతంలో చెప్పారు. దీంతో పరిటాల రవిని ఎదిరించిన అధికారిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. విజయ్ కుమార్ గత ఏడాది తన పదవికి రాజీనామా చేసిన తరువాత తిరుపతి జిల్లా తడ నుంచి కాకినాడ జిల్లా తుని వరకు 142 రోజుల పాటు పాదయాత్ర చేశారు. యాత్ర సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నానని, ప్రజలకు సేవ చేయడానికి సిద్ధమయ్యానంటూ ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరఫున తిరుపతి(ఎస్సీ) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 18న ఈయన నామినేషన్ కూడా వేశారు. జగన్ ప్రభుత్వంలో కీలక శాఖలలో పనిచేసిన విజయ్ కుమార్‌ను వలంటీర్ వ్యవస్థ రూపకల్పనలోనూ కీలక వ్యక్తిగా చెప్తారు.జేడీ లక్ష్మీనారాయణగా పాపులర్ అయిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్నారు. 2019 ఎన్నికలలో జనసేన నుంచి విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం జనసేనకు రాజీనామా చేసి 2023 చివర్లో జై భారత్ నేషనల్ పార్టీ పేరిట కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ నినాదంతో ఆయన ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ ఈసారి విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మారుస్తామంటూ ఇప్పటికే ఒక మేనిఫెస్టోను కూడా ఆయన ప్రకటించారు. 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ సీబీఐలో పనిచేస్తున్న సమయంలో అనేక కీలక కేసుల విచారణలో పాలుపంచుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం మైనింగ్ కేసు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణం, ఎమ్మార్ ప్రాపర్టీస్ వంటి కీలక కేసుల విచారణతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *