సిరా న్యూస్, డిజిటల్:
నగేష్‌కు ఎంపీ టికెట్ లేనట్లేనా!?
+ డిల్లీ బాట పట్టిన బీజేపీ నాయకులు
+ బీఎల్ సంతోష్ జీ ని కలిసి మొరపెట్టుకున్న ఇతర ఆశావాహులు
+ పాత వారికి ఎవ్వరికిచ్చిన కలిసి పనిచేస్తామని ఉద్ఘాటన
+ అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన సంతోష్ జీ!?
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మాజీ మంత్రి గొడం నగేష్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆదిలాబాద్ బీజేపీలో తుఫాన్ మొదలైంది. గొడం నగెష్ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ హామీ తీసుకున్న తరువాతనే బీజేపీలో చేరినట్లు వార్తలు రావడంతో, ఏళ్లుగా బీజేపీ జెండాలు మోస్తున్న పలురువు ఆశావాహులు భగ్గుమన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా, కొత్త వారికి ఎంపీ టికెట్ ఎలా కేటాయిస్తారంటూ పలువురు డిల్లీ బాట పట్టారు.
బీఎల్ సంతోష్ జీతో బేటి…
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే దాదాపు 40మంది అశావాహులు అదిష్ఠానానికి తమ బయోడాటాను అందించారు. క్రమశిక్షణ గల పార్టీగా పేరొందిన బీజేపీలో ఏళ్లుగా పనిచేస్తున్న వారికి గానీ, ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నవారికీ గానీ ఈ సారి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జర్గడంతో ఆశావాహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే గొడం నగేష్ ఎంట్రీతో సీన్ పూర్తిగా మారిపోయింది. గొడం నగేష్‌కు టికెట్ కన్ఫామ్ అంటూ వార్తలు రావడంతో, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ కన్వీనర్ అయ్యంగారి భూమయ్య, కో కన్వీనర్ మయూర్ జకాటే, నిర్మల్ జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, భైంసా నుండి బీజేపీ నాయకుల నారాయణ్ రెడ్డి, ఎంపీ ఆశావాహులు రాజేష్ బాబు, రాథోడ్ రమేష్, రాథోడ్ జనార్ధన్, తదితరులు హుటాహుటిన డిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ జీని కలిసి ఆదిలాబాద్‌లో మారిన పరిస్థితులను గురించి వివరించారు. అయితే అదిష్ఠానం ఇంకా క్యాండిడేట్‌ను ఇంకా కన్ఫామ్ చేయలేదని, ఎవరూ కూడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి, త్వరలో సరైన పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో గొడం నగేష్‌కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఇతర ఆశావాహులు చెబుతున్నారు. రాజేష్ బాబు, రాథోడ్ రమేష్, రాథోడ్ జనార్ధన్లలో ఎవరికో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్లు వినికిడి. ఏదేమైనప్పటికీ కూడా ఆదిలాబాద్‌లో మారిన పరిణామాల దృష్ట్యా గొడం నగేష్‌కు టికెట్ ఇవ్వకపోతే ఈ సారి జాదవ్ రాజేష్ బాబు ఎంపీ టికెట్ ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.