సిరా న్యూస్, హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మరో ఘట్టం ముగిసింది. ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి కావడంతో, దీంతో నామినేషన్ల ఉపసంహరణకు ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండటంతో ఉపసంహరణ రసవత్తరంగా మారింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4,798 నామినేషన్లు దాఖలు కాగా, అత్యధికంగా గజ్వేల్‌లో 145, అత్యల్పంగా నారాయణపేటలో 13 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్క్రూట్నిలో పలువురు కీలక నేతల నామినేషన్లు కూడా తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. కాగా నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలనలో జానారెడ్డి దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఇది ఇలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల కోసం వేరే రాష్ట్రాలకు చెందిన 166 మంది అబ్జర్వర్లను ఎన్నికల కమీషన్ ప్రత్యేకంగా నియమించింది. వీళ్లలో 67 మంది ఐఏఎస్‌లను సాధారణ పరిశీలకులుగా, 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు. వీరితో పాటు మరో 60 మంది ఐఆర్‌ఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించడం జర్గింది. కాగా నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు రెబల్ అభ్యర్థులపై దృష్టి సారించాయి. రెబల్‌గా పోటీ చేస్తున్న వారిని ఎలాగైనా ఉపసంహరించుకునేలా చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు.