సిరా న్యూస్,మంథని;
పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా చందుపట్ల సునీల్ రెడ్డి ని నియమించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి జిల్లాల అధ్యక్షులను ప్రకటించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా మంథని పట్టణానికి చెందిన చందుపట్ల సునీల్ రెడ్డి ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో రామ గుండం నియోజకవర్గానికి చెందిన సోమారపు సత్యనారాయణ, రావుల రాజేందర్ లు పెద్దపెల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. మొదటిసారిగా మంథని నియోజకవర్గానికి చెందిన సునీల్ రెడ్డి కి అధ్యక్ష పదవి రావడంతో బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండిది. మంథని మాజీ శాసనసభ్యుడు చంద్రుపట్ల రాంరెడ్డి కుమా రుడైన సునీల్ రెడ్డి హైదరాబాద్లో ప్రాథమికవిద్య, భోపాల్లోని ఆర్ఆసీలో బీటెక్, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశారు. 15 ఏళ్లు అక్కడే సిస్కో సిస్టమ్స్ మేనేజ్ మెంట్ విధులు నిర్వహించారు. 2010లో తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై విదేశాలను విడిచి ఆయన మంథనికి వచ్చి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సమితిని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లారు. 2014లో టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్య ర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన నాయనమ్మ అనసూయమ్మ పేరు మీద ట్రస్టు ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాల నుండి సామాజిక సేవా కార్యక్రమాలను మంథని నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2021లో బీజేపీలో చేరి మంథని నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పార్ల మెంటు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో యువ నాయకుడైన సునీల్ రెడ్డి కి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం బిజెపికి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. సునీల్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కావడం పట్ల మంథని నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.