సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో కోర్టు ఏర్పాటు ఎప్పుడో..?
* హైకోర్టు సిఫారసు చేసినా అమలుకాని వైనం
* ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న ప్రజలు
ప్రజలకి న్యాయం అందించే న్యాయస్థానానికే న్యాయం జరగడం లేదు. న్యాయం మన ముందుకు వచ్చిందని సంబరపడిన ఓదెల , శ్రీరాంపూర్ మండల ప్రజలకు నిరీక్షణ మాత్రమే మిగిలింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా సాక్షాత్తు ఉన్నత న్యాయస్థానం పెద్దపల్లి జిల్లా ఓదెలలో కోర్టు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినా స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు జరగడం లేదు.కోర్టు ఏర్పాటుకి ఆమోదం పొంది ఆరు నెలలైనా, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. న్యాయమూర్తి కొలువుదీరి కేసులు పరిష్కరించలేదు. న్యాయం కోసం కక్షిదారులు రహదారులు, రవాణా సౌకర్యాలు అనుకూలంగా లేక, సుల్తానాబాద్ కోర్టు వరకు వెళ్లడానికి నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పైగా సుల్తానాబాద్ కోర్టు పరిధిలో ఎక్కువ మండలాలు ఉండడం వలన కేసులన్నీ ఎక్కువైపోయి, పెండింగ్ లోనే ఉంటున్నాయి. న్యాయం జరగడానికి విపరీతమైన జాప్యం జరుగుతున్నది. ఓదెల, శ్రీరాంపూర్ మండల ప్రజలకు సత్వర న్యాయం లభించడం లేదు. ఓదెల మండలంలోని గూడెం మాజీ సర్పంచ్ గోవిందరాజుల ఎల్లస్వామి. అడ్వకేట్ అంబాల రాజు వివిధ గ్రామల సర్పంచుల కృషితో హైకోర్టు స్పందించి ఓదెలలో కోర్టు ఏర్పాటుకు అనుమతించింది. కోర్ట్ ఏర్పాటుకు కావలసిన బిల్డింగ్ ఇతర సదుపాయాలు కల్పించవల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కోర్టు ఏర్పాటును అడ్డుకుంటున్న రాజకీయ శక్తులు ఏమిటో అర్థం గాక ప్రజలు తలలు పట్టు కుంటున్నారు. స్వంత ప్రయోజనాల కోసం ఎవరైనా కావాలనే అడ్డుకుంటున్నారా? అనే సందేహాలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి. సుల్తానాబాద్ కోర్టును విభజన చేయడం ఇష్టం లేని శక్తులు రాజకీయ నాయకులతో మిలాఖతై మోకాలు అడ్డుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, అలసత్వం వీడి కోర్ట్ ఏర్పాటుకు ఉన్న అవాంతరాలను తొలగించి, వీలైనంత తొందరగా కోర్టు ను ప్రజలకు అందుబాటు లోకి తేవాలని ఓదెల ,శ్రీరాంపూర్ మండలాల ప్రజలు కోరుతున్నారు. ఓదెల మండలం రూపు నారాయణపేట గ్రామానికి చెందిన స్థానిక శాసనసభ్యులు విజయ రమణారావు చొరవ చూపి స్థానిక ప్రజల కలను సాకారం చేయాలని వారు కోరుతున్నారు.