సిరా న్యూస్,సిరిసిల్ల;
సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్, సంజీవయ్య నగర్ ప్రాంతం గురువారం కురిసిన కొద్దిపాటి వర్షానికి జలమయమయ్యాయి. సుమారు అరగంటసేపు కురిసిన వర్షానికే సంజీవయ్య నగర్ కమాన్ ప్రాంతంలో వాహనాలు నీట మునిగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల ప్రాంతం కావడంతో ఆసుపత్రులకు వచ్చే రోగులతో పాటు వారి బంధువులు వరదనీటిలో నడవలేక అసహనానికి గురవుతున్నారు. పాత బస్టాండు ప్రాంతం కూడా వర్షపు నీటితో కొద్దిసేపు జలమయమైంది.బస్టాండ్ ఎదురుగా ఉన్న రుచి హోటల్ ముందు భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తంగళ్ళపల్లి మండలంలో పిడుగుపాటుతో ఒకరు మృతి చెందారు.
-ప్రతిసారి ఇదే పరిస్థితి
వర్షం పడ్డ ప్రతిసారి సిరిసిల్లలోని పాత బస్టాండ్, సంజీవయ్య నగర్ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇంకాస్త భారీ వర్షం అయితే పట్టణంలోని వెంకంపేట, ప్రగతి నగర్ వాసుల ఇళ్లలోకి వరద నీరు ముంచేత్తుతోంది.మున్సిపల్ అధికారులు ప్రణాళిక లోపంతో ఇష్టారాజ్యంగా నిర్మించిన మురికి కాలువలు,రోడ్ల వల్ల ఈ పరిస్థితి దాపురించింది. గతంలో ఎంతో భారీ వర్షం పడితే కానీ ముంపు మాట వినని సిరిసిల్ల ప్రాంతం ఇప్పుడు చిన్నవర్షానికి గజగజలాడిపోతోంది. ముంపు ప్రభావిత ప్రాంతాలైన సంజీవయ్య నగర్, ప్రగతి నగర్, అశోక్ నగర్,వెంకంపేట, పాత బస్టాండ్ ఏరియా,శ్రీనగర్ కాలనీలో అయితే వర్షం పడితే చాలు వరద ముంచుకొస్తుందేమోనన్నఆందోళనలతో భయభ్రాంతులకు గురవుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా సిరిసిల్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.వరదలు అడ్డుకునేందుకు మునిసిపల్ శాఖ చేపట్టిన పనులు ఏమి సత్ఫలితాలను ఇవ్వడం లేదు.