సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి, గవర్నర్ తమిళ సై మధ్య కొన్నాళ్లుగా నెలకొన్న వివాదం కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా గవర్నర్ అనేక నిర్ణయాలను తీసుకున్నారు. గవర్నర్ వ్యవహారశైలి పట్ల బాహాటంగానే అప్పట్లో కేసీఆర్, కేటీఆర్ సహా అనేక మంది బీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో గవర్నర్ తమిళ సై, బీఆర్‌ఎస్ మధ్య ఉన్న విబేధాలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. అందుకు విరుద్ధంగా గణతంత్ర దినోత్సవం రోజున బీఆర్‌ఎస్, గవర్నర్‌కు మధ్య ఉన్న వివాదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. బీఆర్‌ఎస్ పార్టీకి, గవర్నర్‌కు మధ్య తాజా వివాదానికి ఎమ్మెల్సీలు నియామకం కారణమయ్యాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ అధికారిక ప్రసంగంలోనూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టేలా ఉండడంతో.. గవర్నర్ తమిళ సై, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య వివాదం కొనసాగుతోందన్న విషయం మరోసారి బహిర్గతమైంది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆమె ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి వివరించడంతోపాటు గత ప్రభుత్వంపైనా ఆమె విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించినప్పుడు ప్రజలే కార్యోన్ముకులై తమ పోరాటాలను, తీర్పులు ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తి రాజ్యాంగం ఇచ్చిందన్నారు గవర్నర్ తమిళ సై. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని విస్పష్టమైన తీర్పుతో ప్రకటించిందన్నారు. పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే పునర్మించుకుంటున్నాయన్నారు. గడిచిన పదేళ్ల పాలకుల వైఫల్యం యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని, ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన తెలంగాణలో ఉందంటూ గత బీఆర్‌ఎస్ పాలనను గవర్నర్ తూర్పారబట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చిన ప్రసంగంలో దాదాపు సగం.. గత ప్రభుత్వంపై విమర్శల, ఆరోపణలకు కేటాయించడం ఆసక్తిని కలిగిస్తోది. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు ఘాటుగానే స్పందించారు. గణతంత్ర దినోత్సవం రోజున బీఆర్‌ఎస్ గత ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేసేలా ప్రసంగించిన గవర్నర్‌పై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో గతంలో మాదిరిగానే ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్ వర్సెస్ తమిళ సై అన్న రీతిలో వ్యవహారం నడుస్తోంది. గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.. కాంగ్రెస్, బీజేపీ రహస్య మైత్రి మరోసారి బయటపడిందన్నారు.