ఆపరేషపన్ చిరుత సక్సెస్

సిరా న్యూస్,హైదరాబాద్;
ఐదు రోజుల క్రితం హఐదరాబాద్ శివారు శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు రాత్రి బోనులో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ప్రకటించారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచారం జరుగుతుండటంతో ఎయిర్ పోర్టు సిబ్బందితో పాటు చుట్టు పక్కల గ్రామస్థులు కూడా భయాందోళనలకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఎయిర్ పోర్టు రన్ వేపై చిరుత కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు ఎయిర్ పోర్టు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది చిరుత కోసం వేట మొదలుపెట్టారు.అనుమానిత చిరుత సంచార ప్రాంతాలను గుర్తించిన అధికారులు, ప్రత్యేకించి ఇరవై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐదు బోన్లను ఏర్పాటు చేశారు. బోన్లలో మేకలను ఎరగా ఉంచారు. ఒకానొక దశలో చిరుత బోను వరకూ వచ్చి వెనకి వెళ్లిపోతుండటంతో చిరుత చిక్కలేదు. అయితే గురువారం (మే2వ తేదీ) రాత్రి మాత్రం మేకను ఆహారంగా తినేందుకు వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. దీంతో కొంతకాలంగా టెన్షన్ పెట్టిన చిరుత ఎట్టకేలకు బోనులో పడటంతో ఇటు అటవీ శాఖ అధికారులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత బోనులో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుంచి చిరుతను నెహ్రూ జూ పార్క్ తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పాటు పర్యవేక్షణలో ఉంచుతామని డోబ్రియల్ తెలిపారు. తర్వాత అడవిలో విడిచి పెడతామని పేర్కొన్నారు. ఐదురోజులుగా చిరుతను బంధించడం కోసం శ్రమించిన రంగారెడ్డి జిల్లా డీఎఫ్‌వో సుధాకర్ రెడ్డి, ఎఫ్‌డీవో విజయనంద్‌లను ప్రత్యేకంగా అభినందించారు.
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *