సిరా న్యూస్,సంగారెడ్డి;
కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ప్లాట్ల యజమానులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వివిధ శాఖల అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం లేదని, న్యాయం చేయాలని ఫ్లాట్ ఓనర్లు మొరపెట్టుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం వెంకట రమణ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి, బాధితులు మాట్లాడుతూ వెంకటరమణ కాలనీ సర్వే నంబర్ 152, 153 లో 1985 లో మధ్య తరగతి ఉద్యోగులు 144 మంది ప్లాట్లను కొనుగోలు చేశామన్నారు. సర్వే నంబర్ 152 లోని ఐదెకరాల 22 గుంటలు, 153లోని 9 ఎకరాల 25 గుంటల భూమిని మొత్తం 15 ఎకరాల ఏడు గుంటలను వెంకటరమణ కాలనీ హుడా లే అవుట్ లో ప్లాట్లను కొనుగోలు చేయగా గోల్ఢెన్ కీ మిరాకీ సంస్థ నాలుగు ఎకరాలు, చక్రపురి కాలనీ అధ్యక్షుడు బి. నరోత్తం రెడ్డి ఎకరానికి పైగా మొత్తం ఐదెకరాల వరకు అక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. తమకు న్యాయం చేయాలంటూ హెచ్ ఎం డీ ఏ, రేరా, పోలీసు శాఖలతో పాటు 12 శాఖలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. రాజకీయ నాయకుల హస్తం ఉందని తమకు న్యాయం చేయాలని బాధితులు మీడియా ఎదుట ఏకరువు పెట్టుకున్నారు.